మళ్ళీ ఖిలాడి దర్శకుడినే నమ్మిన మాస్ రాజా

మాస్ రాజా రవితేజ అభిమానులకు ఒక పేరు చెబితే విపరీతమైన కోపం వస్తుంది. ఆ పేరే.. రమేష్ వర్మ. మాస్ రాజాతో ఒకటికి రెండు సినిమాలు తీశాడితను. తొలి చిత్రం ‘వీర’ పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ.. చాలా గ్యాప్ తర్వాత అతడితో ‘ఖిలాడి’ చేశాడు రవితేజ. ఈ సినిమా కూడా పెద్ద డిజాస్టరే అయింది. రవితేజకు మిగతా డైరెక్టర్లెవరూ డిజాస్టర్లు ఇవ్వలేదని కాదు కానీ.. ఒక పెద్ద డిజాస్టర్ తర్వాత మళ్లీ ఇంకో ఛాన్స్ ఇచ్చినా దాన్ని కూడా వృథా చేస్తూ ఇంకో డిజాస్టర్ ఇవ్వడం అభిమానులకు అస్సలు రుచించలేదు.

పైగా రెండు సినిమాల గురించి విడుదలకు ముందు చాలా గొప్పగా చెప్పడం, చివరికి చూస్తే ఆ మాటలకు సినిమాకు పొంతన లేకపోవడం వారి ఆగ్రహానికి కారణం. ఇది చాలదన్నట్లు ‘ఖిలాడి’ విడుదల సమయంలో రమేష్ వర్మ భార్య.. రవితేజను ఉద్దేశించి పరోక్షంగా విమర్శనాత్మక పోస్టులు పెట్టడం కూడా చర్చనీయాంశం అయింది. ఈ దెబ్బకు ఇద్దరి మధ్య చెడినట్లే అని.. మళ్లీ రవితేజ రమేష్ వర్మ జోలికి వెళ్లకపోవచ్చని అంతా అనుకున్నారు.

కానీ మాస్ రాజా మళ్లీ అతణ్ని నమ్మడం అభిమానులకు పెద్ద షాక్. గతంలో కొన్ని చిత్రాల్లో నటించిన రవితేజ సోదరుడు రఘు గుర్తున్నాడా? అతడి కొడుకు మాధవ్ భూపతి రాజు ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. అతడి తొలి సినిమా పేరు.. ‘ఏయ్ పిల్లా’. మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ రూబల్ షికావత్ ఈ చిత్రంతో కథానాయికగా పరిచయం అవుతోంది. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు, రమేష్ వర్మకు ఏం సంబంధం అంటారా? ఈ చిత్రానికి కథ అందించింది రమేషే. దర్శకుడిగానే కాక రచయితగానూ రమేష్ వర్మ ట్రాక్ రికార్డు పేలవమే. అతను కథ అందించిన ‘7’ అనే సినిమా దారుణమైన ఫలితం అందుకుంది.

దర్శకుడిగా మొత్తం కెరీర్లో రమేష్ వర్మ ఇచ్చిన హిట్లు ‘రైడ్’, ‘రాక్షసుడు’ మాత్రమే. అందులో మొదటిది ఓ మోస్తరుగా ఆడింది. ఆ చిత్రం కొరియన్ మూవీ ‘బైసికల్ థీవ్స్’కు ఫ్రీమేక్ అన్న సంగతి తెలిసిందే. రెండో సిినిమా తమిళ మూవీ ‘రాక్షసన్’కు రీమేక్. దాన్ని మక్కీకి మక్కీ దించి హిట్లు కొట్టాడు రమేష్. ఇక అతను తీసిన మిగతా సినిమాలు ‘ఒక ఊరిలో’, ‘వీర’, ‘అమ్మాయితో అబ్బాయి’, ‘ఖిలాడి’ డిజాస్టర్లయ్యాయి. ఇలాంటి ట్రాక్ రికార్డున్న రమేష్‌ను రవితేజ మళ్లీ నమ్మి తన ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త తరం హీరోను పరిచయం చేసే బాధ్యత అప్పగించడం ఆశ్చర్యమే.