థియేటర్లు కళకళ.. ఇప్పుడెవరిని నిందిస్తారు?

జనాలు థియేటర్లకు రావట్లేదు.. కరోనా వాళ్ల ఆలోచనను మార్చేసింది.. ఓటీటీ కొంపముంచింది.. సినిమాల పరిస్థితి అగమ్య గోచరం.. ఇలా అయితే థియేటర్ల మనుగడ సాగించేదెలా? ఇక సినిమాల నిర్మాణం మానుకోవాల్సిందే.. ఇలా ఎన్నెన్నో మాటలు వినిపించాయి ఈ మధ్య. సినిమాలకు వసూళ్లు అంతకంతకూ పడిపోతుండటం.. ఓపెనింగ్సే లేకపోవడంపై సినీ జనాలు రకరకాలుగా స్పందించారు.

కొందరైతే ప్రేక్షకులను కూడా నిందించారు.. కట్ చేస్తే ఇప్పుడు బాక్సాఫీస్ కళకళలాడుతోంది. థియేటర్లు జనాలతో నిండిపోతున్నాయి. ఈ వారం రిలీజైన ‘బింబిసార’, ‘సీతారామం’ రెండూ కూడా మంచి ఫలితం దిశగా అడుగులు వేస్తున్నాయి. మార్కెట్ పడిపోయిందనుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా హౌస్ ఫుల్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ చిత్రానికి థియేటర్లు, షోలు పెంచాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. క్లాస్ లవ్ స్టోరీ అయినప్పటికీ ‘సీతారామం’ దాని స్థాయిలో అది బాగా ఆడుతోంది.

దానికీ వసూళ్లు పెరుగుతున్నాయి. ఈ చిత్రాల జోరు వీకెండ్‌కు పరిమితం అయ్యేలా లేదు. ఎక్కువ రోజులే ఆడే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో జనాలు థియేటర్లకు రావట్లేదని, ఏదో అయిపోతోందని, ఇక కష్టమని అన్న వారంతా ముక్కుల వేలేసుకోవాల్సిన పరిస్థితి. దీని సారాంశం.. సింపుల్. మంచి కంటెంట్ ఇస్తే ప్రేక్షకులు థియేటర్లకు కచ్చితంగా వస్తారు. వాళ్లలో ఆసక్తి రేకెత్తిస్తే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతాయి. సినిమాకు మంచి టాక్ వస్తే థియేటర్లు నిండుతాయి. వీకెండ్లోనే కాక వీక్ డేస్‌లో బాగా ఆడుతాయి. సరైన సినిమాలు తీయకుండా.. ఏదో జరిగిపోతోందని ఆందోళన చెందడంలో అర్థం లేదు.

రెండు నెలల కిందట మేజర్, విక్రమ్ సినిమాలు కూడా ఎంత బాగా ఆడాయో తెలిసిందే. గత రెండు నెలల్లో సినిమాలేవీ ఆడలేదంటే.. వాటిలో విషయం లేకపోవడం కారణం. ఒకసారి ఈ రెండు నెలల చిత్రాలను పరిశీలించి అందులో ఏ సినిమా బాగుండి కూడా ఆడలేదో చెప్పమంటే సమాధానం ఉండదు ఎవరిదగ్గరా? సినిమా బాగుండి, టికెట్ల ధరలు అందుబాటులో ఉంటే బాక్సాపీస్‌కు వచ్చిన కష్టమేమీ లేదు అనడానికి మేజర్, విక్రమ్, బింబిసార, సీతారామం సినిమాలే ఉదాహరణ.