బాయ్‌కాట్.. బాయ్‌కాట్.. బాయ్‌కాట్.. ఈ మధ్య సోషల్ మీడియాలో బాలీవుడ్ సినిమాలకు సంబంధించి తరచుగా వినిపిస్తున్న మాట ఇది. ఒకప్పటి విషయాలను బయటికి తీసి.. ఇప్పుడు రిలీజవుతున్న సినిమాలకు ముడిపెట్టి.. వాటిని బాయ్‌కాట్ చేయాలని హిందీ ప్రేక్షకుల్లో కొన్ని వర్గాలు రాద్దాంతం చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. అసలే కొవిడ్ తర్వాత బాలీవుడ్ సినిమాల పరిస్థితి దారుణంగా తయారైంది.
ఒకప్పుడు రిలీజ్ రోజున పది కోట్లకు పైగా వసూళ్లు అలవోకగా వచ్చేసేవి. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకు కూడా 3-4 కోట్ల డే-1 వసూళ్లు వస్తుండటం షాకిస్తోంది. పరిస్థితి అసలే ఘోరంగా ఉంటే.. సినిమా విడుదలకు ముందే బాయ్‌కాట్ బ్యాచ్ మరింత ఇబ్బంది పెడుతున్నట్లు అనిపిస్తోంది. అసలు సినిమాలో ఏం ఉందో.. అది ఎలాంటి సినిమానో చూడకుండా నటుల వ్యక్తిగత విషయాలను బయటికి తీసి వాటితో సినిమాకు ముడిపెట్టి ‘బాయ్‌కాట్ బాయ్‌కాట్’ అనడం కరెక్ట్ కాదని కొంతమంది సినీ ప్రముఖుల అభిప్రాయం.
తరచుగా ట్రెండ్‌లో ముఖ్యంగా రెండు వర్గాలు పాల్గొంటున్నాయి. ఒకటి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులుగా చెప్పుకుంటున్న వర్గం. అతడి మరణానికి బాలీవుడ్‌లోని బడా బాబులే కారణమన్న అభిప్రాయంతో ఉన్న ఈ వర్గం.. ఖాన్ త్రయంతో పాటు బాలీవుడ్ స్టార్ కిడ్స్ అందరినీ టార్గెట్ చేస్తోంది. ఇక మరో వర్గం.. బాలీవుడ్లో ఎప్పుడూ హిందుత్వాన్ని కించపరిచే సినిమాలే తీస్తుంటారని.. బాలీవుడ్లో చాలామంది మీద ఆ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. గతంలో కొన్ని సినిమాల్లో ఉన్న హిందూ వ్యతిరేక సన్నివేశాలకు, బయట ఇచ్చిన స్టేట్మెంట్లకు, వారి ప్రవర్తనకు ముడి పెడుతూ ఆయా స్టార్ల కొత్త సినిమాలను ఈ వర్గం టార్గెట్ చేస్తోంది.
ఈ రెండు వర్గాలూ ఈ మధ్య ఏ పెద్ద సినిమా రిలీజైనా.. బలంగా బాయ్‌కాట్ ట్యాగ్స్ ను స్ప్రెడ్ చేస్తున్నాయి. తాజాగా ఆమిర్ ఖాన్ సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా విషయంలో కూడా గతంలో ఆయన చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టార్గెట్ చేస్తున్నారు. ఐతే రోజు రోజుకూ ఈ నెగెటవిటీ శ్రుతి మించిపోతే సినిమాల పరిస్థితి దారుణంగా తయారవుతుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.