బింబిసార క్రేజ్‌కు నిద‌ర్శ‌నం

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ సినిమాకు థియేట‌ర్లు క‌ళ‌క‌ళాడి చాలా కాలం అయింది. చివ‌ర‌గా అత‌డికి స‌క్సెస్ అందించిన 118 సైతం ఏదో ఒక మాదిరిగా ఆడింది త‌ప్ప‌.. ఆ సినిమా చూడ్డానికి జ‌నాలేమీ ఎగ‌బ‌డ‌లేదు. దాని త‌ర్వాత వ‌చ్చిన ఎంత‌మంచివాడ‌వురా, 118కు ముందు వ‌చ్చిన సినిమాల సంగ‌తి చెప్పాల్సిన ప‌ని లేదు. ఐతే ఈ ట్రాక్ రికార్డు క‌ళ్యాణ్ రామ్ కొత్త సినిమా బింబిసార‌ మీద ఏమాత్రం ప్ర‌భావం చూపించ‌డం లేదు.

ఆస‌క్తిక‌ర ట్రైల‌ర్ల‌తో ప్రేక్ష‌కుల్లో క్యూరియాసిటీ పెంచిన ఈ సినిమాకు.. ప్రి రిలీజ్ ప్ర‌మోష‌న్లు కూడా బాగానే క‌లిసొస్తున్న‌ట్లున్నాయి. కొత్త ద‌ర్శ‌కుడు వ‌శిష్ఠను న‌మ్మి భారీ ఖ‌ర్చుతో క‌ళ్యాణ్ రామ్ నిర్మించిన సినిమా చూసేందుకు ప్రేక్ష‌కులు ఉత్కంఠ‌గానే ఎదురు చూస్తున్న‌ట్లున్నారు. బింబిసార అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి డిమాండే క‌నిపిస్తోంది. హైద‌రాబాద్ కూక‌ట్ ప‌ల్లిలోని ప్ర‌ముఖ థియేట‌ర్ భ్ర‌మ‌రాంభ‌లో శుక్ర‌వారం ఉద‌యం 6.30కి స్పెష‌ల్ షో ప్లాన్ చేసి, బుక్ మై షోలో టికెట్లు పెట్ట‌గా.. రెండు మూడు గంట‌ల్లో సోల్డ్ ఔట్ అయిపోయింది.

ప్ర‌స్తుతం బాక్సాఫీస్ ఎలాంటి గ‌డ్డు ప‌రిస్థితి ఎదుర్కొంటోందో తెలిసిందే. ఇంకా పెద్ద స్థాయి సినిమాల‌కు కూడా తొలి రోజు హౌస్ ఫుల్స్ క‌ష్ట‌మ‌వుతోంది. స్పెష‌ల్ షోలు, బెనిఫిట్ షోలు వేసినా అభిమానుల నుంచి స్పంద‌న క‌రువ‌వుతోంది. అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ లేక ఇలాంటి షోలు ప్లాన్ చేయ‌ట్లేదు. షోలు ప్లాన్ చేసి క్యాన్సిల్ చేయాల్సిన ప‌రిస్థితులు కూడా త‌లెత్తుతున్నాయి.

ఐతే బింబిసార‌కు ధైర్యం చేసి షో వేయాల‌ని నిర్ణ‌యించ‌గా.. నంద‌మూరి అభిమానుల పుణ్య‌మా అని థియేట‌ర్ కొన్ని గంట‌ల్లోనే సోల్డ్ ఔట్ అయిపోయింది. నంద‌మూరి హీరోల సినిమాల‌కు భ్ర‌మ‌రాంభ‌లో ఇలా స్పెష‌ల్ షోలు వేయ‌డం, వాటికి మంచి రెస్పాన్స్ రావ‌డం మామూలే. బింబిసార‌కు తెలుగు రాష్ట్రాల్లో మ‌రిన్ని స్పెష‌ల్ షోలు ప‌డే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ముందు రోజు పెయిడ్ ప్రిమియ‌ర్స్ ఉండొచ్చ‌ని కూడా వార్త‌లొస్తున్నాయి.