కన్నడ సినిమాకు గోల్డెన్ డేస్

ఒకప్పుడు శాండల్ వుడ్ మార్కెట్ చాలా పరిమితం. అక్కడి స్టార్ హీరోలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్లు కొట్టినా ఇతర భాషల్లో డబ్బింగ్ అయిన దాఖలాలు చాలా తక్కువ. పునీత్ రాజ్ కుమార్, సుదీప్, దర్శన్ లాంటోళ్ళు కన్నడలో ఎన్ని బ్లాక్ బస్టర్లు సాధించినా వాటి అనువాదాలు ఇక్కడ కనీస స్థాయిలో ఆడేవి కావు. ఒకదశ దాటాక మనవాళ్ళు ఈ కారణంగానే వాటిని కొనడం మానేశారు.

ఓం, అప్పు లాంటి ఇండస్ట్రీ హిట్లు రీమేక్ అయ్యాయి తప్పించి నేరుగా ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఒక్క ఆరు నెలల్లోనే మొత్తం సీన్ మారిపోయింది. కెజిఎఫ్ 2 ఆల్ టైం ఇండియా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఏకంగా 1200 కోట్లను కొల్లగొట్టేయడం ఏదో గాలివాటం సక్సెస్ అనుకున్న వాళ్ళకు అక్కడి మేకర్స్ ధీటుగానే బదులిస్తున్నారు. దానికి సాక్ష్యమే 777 ఛార్లీ. ఒక కుక్కను టైటిల్ రోల్ లో పెట్టి హిందీతో సహా దేశవ్యాప్తంగా ఒకే రకమైన స్పందన అందుకోవడం అరుదైన ఫీటే.

ఇప్పటికీ హైదరాబాద్ లో కొన్ని షోలు రన్ అవుతున్నాయంటే దీని రీచ్ ని అర్థం చేసుకోవచ్చు. ఇక విక్రాంత్ రోనా సంగతి సరేసరి. నాలుగు రోజులకే ఏపీ, తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అందుకుని రామారావుకే షాక్ ఇచ్చింది. గతంలో ఈ స్థాయి ఇంపాక్ట్ సౌత్ నుంచి కేవలం తెలుగు తమిళ సినిమాల నుంచి మాత్రమే ఉండేది.

మలయాళంలో కమర్షియల్ స్కేల్ తక్కువ కాబట్టి అంతగా చర్చలోకి వచ్చేవి కావు. కానీ ఇప్పుడు కన్నడ కూడా ఈ లిస్టులో తోడయ్యింది. దెబ్బకు నిర్మాణంలో ఉన్న అక్కడి క్రేజీ మూవీస్ కి డిమాండ్ పెరగడం గమనార్హం. శివరాజ్ కుమార్ లాంటి సీనియర్లు కూడా ఇప్పుడిప్పుడే బయట మార్కెట్ల మీద దృష్టి సారించడం మొదలుపెట్టారు. ఆదాయమూ పెరుగుతోంది కాబట్టి నిర్మాతలు బడ్జెట్ విషయంలో రాజీ పడటం లేదు. అంతా కాల మహిమ.