ఈ అవార్డులో ఆయనకూ వాటా ఇవ్వాలి

జాతీయ అవార్డులు ప్రకటించాక నిరాశగా నిట్టూర్పు విడిచే టాలీవుడ్ జనాలు.. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. కొన్నేళ్ల నుంచి టాలీవుడ్‌కు ఈ అవార్డుల్లో మంచి ప్రాధాన్యమే దక్కుతోంది. ఈ ఏడాది మన ఇండస్ట్రీ నుంచే ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్ ఎంపిక కావడం అందరికీ ఎంతో ఆనందాన్నిచ్చే విషయమే. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అమితంగా అలరించిన ‘అల వైకుంటపురములో’ ఆల్బంకు ఈ గౌరవం దక్కడం పట్ల అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు.ఐతే కొన్నేళ్ల ముందు తమన్ ట్రాక్ రికార్డు,

అతడి పనితీరును చూస్తే అతను ఈ స్థాయికి చేరుకుంటాడని, ఇలా జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలుస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. అప్పటికి పెద్ద పెద్ద సినిమాలకు పని చేస్తున్నప్పటికీ.. ఒక ఊకదంపుడు ట్యూన్లతో చాలా విమర్శలు ఎదుర్కొంటూ ఉండేవాడు తమన్. అభిరుచి ఉన్న ప్రేక్షకులకు అతడి పాటల విషయంలో చాలా కంప్లైంట్స్ ఉండేవి.

సోషల్ మీడియా ట్రోలింగ్స్ సంగతి సరే సరి.అలాంటి సంగీత దర్శకుడు తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకునేలా చేయడంలో దర్శకుడు త్రివిక్రమ్‌ది కీలక పాత్ర. తమన్ సంగీతం అందరికీ చాలా కొత్తగా అనిపించి, విమర్శల ప్రశంసలు దక్కేలా చేసిన సినిమా ‘అరవింద సమేత’. అందులో పాటలు, నేపథ్య సంగీతంతో తమన్ మెస్మరైజ్ చేశాడు. ఆ సమయానికి తమన్ నుంచి అలాంటి ఔట్ పుట్ అందరికీ షాకింగే. మంచి సంగీత అభిరుచి ఉన్న దర్శకుడితో జట్టు కట్టి.. కథ ఇన్‌స్పైర్ చేస్తే ఎలాంటి సంగీత దర్శకుడు అయినా ఎంత మనసు పెట్టి పని చేస్తాడో తమన్ రుజువు చేశాడు.

ఆ సినిమా ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో అతడి నుంచి అదిరిపోయే ఆల్బమ్స్ వచ్చాయి. అందులో అత్యుత్తమమైంది ‘అల వైకుంఠపురములో’. ఈసారి త్రివిక్రమ్ కలయికలో ఆల్ టైం క్లాసిక్, బ్లాక్‌బస్టర్ ఆల్బం ఇచ్చాడు తమన్. ఇందులో సామజ వరగమన, రాములో రాములా, బుట్టబొమ్మా పాటలు ఎంత పాపులర్ అయ్యాయో.. ఎన్ని కోట్ల మందిని అలరించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు గాను అతను జాతీయ అవార్డు కూడా అందుకోవడం అందరినీ సంతోషపెడుతోంది. కాబట్టి ఈ అవార్డులో కచ్చితంగా త్రివిక్రమ్‌కు వాటా ఇవ్వాలనడంలో సందేహం లేదు.