ప్రతాప్ పోతన్.. నిన్నటితరం లెజెండరీ మలయాళ యాక్టర్ కమ్ రైటర్ కమ్ డైరెక్టర్. ఆయన పేరు మన ప్రేక్షకుల్లో చాలామందికి తెలియకపోవచ్చు కానీ.. రూపం చూడగానే చాలా ఫేమస్ యాక్టర్ అనే విషయం అర్థమైపోతుంది. ఆయన శుక్రవారం తెల్లవారుజామున హఠాత్తుగా మరణించారు. ఆయన ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది.
ప్రతాప్ పోతన్ వయసు 70 సంవత్సరాలు. వయసు మీద పడ్డా ఆయన ఇప్పటికీ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. తమిళ, మలయాళ భాషల్లో నటిస్తూనే ఉన్నారు. 80, 90 దశకాల్లో సినిమాలు బాగా చూసిన దక్షిణాది ప్రేక్షకులకు ప్రతాప్ పోతన్ గురించి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తమిళ, మలయాళ అనువాద చిత్రాలతో పాటు ఆయన తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం.
తెలుగులో కూడా డైరెక్ట్‌గా కొన్ని సినిమాల్లో నటించారు. తెలుగులో చివరగా సిద్దార్థ్ సినిమా ‘చుక్కల్లో చంద్రుడు’ చిత్రంలో నటించారు ప్రతాప్ పోతన్. ఆల్ టైం క్లాసిక్ మూవీ ‘ఆకలి రాజ్యం’ తెలుగులో ఆయన తొలి చిత్రం. ఆ తర్వాత మరెన్నో సినిమాల్లో నటించారు. ఎక్కువగా కమల్ హాసన్ అనువాద చిత్రాలతో ప్రతాప్.. తెలుగు ప్రేక్షకులను పలకరించేవారు. ప్రతాప్ ప్రతిభావంతుడైన రచయిత, దర్శకుడు కూడా. పదికి పైగా సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. తెలుగులోనూ ఆయన డైరెక్ట్ చేసిన సినిమా ఉండడం విశేషం. అదే.. చైతన్య.
అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం 1991లో విడుదలై ఓ మోస్తరు స్పందన తెచ్చుకుంది. దర్శకుడిగా తమిళంలో ఆయన తొలి చిత్రం ‘మీండుం ఒరు కాదల్ కదై’ ఎన్నో అవార్డులు రివార్డులు తెచ్చుకుంది. అందులో ఆయనే లీడ్ రోల్ చేసి ప్రశంసలు అందుకున్నారు. ఇంకా దర్శకుడిగా ఆయన కొన్ని క్లాసిక్స్ అందించారు. 70 ఏళ్ల వయసులోనూ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆయన.. హఠాత్తుగా మరణించి అభిమానులను విషాదంలో ముంచెత్తారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates