‘థ్యాంక్‌ యు’ ఎందుకు చూడాలి.. దిల్ రాజు ప్రశ్న

కొవిడ్ తర్వాత మారిన పరిస్థితుల కారణంగా ఈ రోజుల్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం సవాలుగా మారిపోతోంది. భారీతనం, యాక్షన్, క్రేజీ కామెడీ.. ఇలా ఏదో ఒక అంశం వారిని బాగా ఆకర్షిస్తే తప్ప ప్రేక్షకులు వెండితెరల వైపు కదలట్లేదు. రాజమౌళి అన్నట్లు ఏ జానర్లో సినిమా చేసినా అది ఫుల్ ప్లెడ్జ్డ్‌గా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఒక ఫీల్ గుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అక్కినేని నాగచైతన్య.

అతను ప్రధాన పాత్రలో ‘మనం’ దర్శకుడు విక్రమ్ కుమార్ రూపొందించిన సినిమా ‘థ్యాంక్ యు’. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జులై 22న థియేటర్లలోకి దిగబోతోంది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. ఒక వ్యక్తి జీవితంలోని వివిధ దశలను చూపిస్తూ.. తాను కోరుకున్న విజయాన్నందుకున్నాక, ఆ విజయానికి కారణమైన వ్యక్తులను గుర్తు చేసుకుంటూ వారి కోసం తపించే కథతో ఈ సినిమా తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

కాగా ‘థ్యాంక్ యు’ థియేట్రికల్ లాంచ్ సందర్భంగా చిత్ర నిర్మాత దిల్ రాజు.. ఈ సినిమా ఎందుకు చూడాలి అనే ప్రశ్నను తనే వేసి, దానికి సమాధానం చెప్పడం విశేషం. ‘‘అసలు థ్యాంక్ యు సినిమా ఎందుకు చూడాలి. చైతూ అభిమానులేమో తన కోసం చూస్తారు. మరి మిగతా వాళ్ల సంగతేంటి? ఈ ఏడాది వేసవిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూశారు. అందులో ఇద్దరు స్టార్ హీరోలు బ్రహ్మాండమైన యాక్షన్‌ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు. ‘కేజీఎఫ్-2’ కూడా విజువల్‌గా అద్భుతంగా చూపించారు. దాన్ని కూడా చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. అంతకుముందు పుష్ప కూడా అద్భుతంగా అనిపించింది. సర్కారు వారి పాట లాంటి పెద్ద సినిమాను కూడా ప్రేక్షకులు చూశారు. ఇవన్నీ పెద్ద స్టార్ హీరోలు నటించిన సినిమాలు.

మరి థ్యాంక్ యు సినిమా ఎందుకు చూడాలి అంటే.. ఇందులో ఉన్న ఫీల్ కోసం. కొన్ని సినిమాలు చూసి వచ్చాక దాని తాలూకు ఫీలింగ్ అలాగే మనతో కంటిన్యూ అవుతుంది. ఆ సినిమాలు మన మనసుల్లో ఉండిపోతాయి. థ్యాంక్ యు కూడా అలాంటి సినిమానే. ఈ సినిమా చూసి బయటికి రాగానే ప్రతి ఒక్కరూ ఫోన్ తీసి కచ్చితంగా తమకు కావాల్సిన వాళ్లకు ఫోన్ చేస్తారు. ఈ సినిమా ప్రేక్షకులపై అలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది’’ అని దిల్ రాజు అన్నాడు.