ఔను.. రామ్‌తో సినిమా చేస్తున్నా-హ‌రీష్‌


స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ చివ‌రి సినిమా గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ రిలీజై మూడేళ్లు కావ‌స్తోంది. కానీ ఇప్ప‌టిదాకా అత‌డి త‌ర్వాతి సినిమా మొద‌లే కాలేదు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ సినిమా చేయ‌డానికి అన్నీ సిద్ధం చేసుకుని ఏడాది కింద‌ట్నుంచి ఎదురు చూస్తున్నాడ‌త‌ను. కానీ ప‌వ‌న్ ఎంత‌కీ ఈ సినిమాకు డేట్లు కేటాయించ‌ట్లేదు. ఇదిగో అదిగో అనుకుంటూనే కాలం గ‌డిచిపోతోంది.

స‌మీప భ‌విష్య‌త్తులో ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం క‌నిపించ‌క‌పోవ‌డంతో హ‌రీష్ ప్ర‌త్యామ్నాయం చూసుకుంటున్నాడ‌ని, యువ క‌థానాయ‌కుడు రామ్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని కొన్ని రోజులుగా వార్త‌లొస్తున్న సంగ‌తి తెలిసిందే. ఐతే ఎప్పుడు ఏంటి అన్న‌ది క్లారిటీ ఇవ్వ‌లేదు కానీ.. రామ్‌తో సినిమా చేయ‌బోతున్న విష‌యాన్ని మాత్రం హ‌రీష్ శంక‌ర్ ధ్రువీక‌రించాడు. ఇందుకు రామ్ కొత్త చిత్రం ది వారియ‌ర్ ప్రి రిలీజ్ ఈవెంట్ వేదిక అయింది.

ఈ వేడుకకు అతిథుల్లో ఒక‌డిగా వ‌చ్చిన హ‌రీష్‌ శంక‌ర్.. రామ్‌తో త‌న అనుబంధం గురించి మాట్లాడాడు. అత‌డితో సినిమా చేయాల‌ని ఎప్ప‌ట్నుంచో అనుకుంటున్నాన‌ని, అత‌డికి క‌థ కూడా చెప్పాన‌ని.. కానీ ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల తమ కాంబినేష‌న్ కార్య‌రూపం దాల్చ‌లేద‌ని చెప్పాడు హ‌రీష్‌.

రామ్‌కు క‌థ చెబితే తాను ఒక హీరో అని మ‌రిచిపోయి ఒక ప్రేక్ష‌కుడిలా వింటాడ‌ని.. తాను అత‌డికి ఒక సెన్సిటివ్ ల‌వ్ స్టోరీ చెప్పాన‌ని.. అందులో ఇద్ద‌రు హీరోల‌ని.. ఐతే క‌థ విన్నాక ఫ్యాన్ 2-3లో తిరుగుతున్న‌ట్లు అనిపించింద‌ని, మ‌న కాంబినేష‌న్లో సినిమా వ‌స్తే ఫ్యాన్ స్పీడ్ 5లో ఉన్న‌ట్లు ఉండాల‌ని రామ్ అన్నాడ‌ని.. ఆ మాట‌ను తాను ఎప్ప‌టికీ మ‌రిచిపోలేన‌ని హ‌రీష్ అన్నాడు. ఇక రామ్‌తో ఇప్పుడు సినిమా చేసే విష‌య‌మై హ‌రీష్ మాట్లాడుతూ.. త‌మ కాంబినేష‌న్లో క‌చ్చితంగా సినిమా వ‌స్తుంద‌ని.. అది ఎప్పుడు ఏంట‌న్న‌ది చెప్ప‌లే.