వేణు మళ్ళీ అదే ట్విస్ట్ ఇస్తారా

23 ఏళ్ళ క్రితం టాలీవుడ్ కు పరిచయమైన వేణు తొట్టెంపూడిని అప్పటి యూత్ అంత సులభంగా మర్చిపోలేరు. హీరోగా చేసింది కొన్ని సినిమాలే అయినా కమర్షియల్ ఫార్ములాకి దూరంగా క్లీన్ ఎంటర్ టైనర్స్ లో నటించి అలా గుర్తుండిపోయాడు. ముఖ్యంగా చిరునవ్వుతో క్యారెక్టరైజేషన్ ఇప్పటికీ మంచి వ్యక్తిత్వ వికాసానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. స్వయంవరం, పెళ్ళాం ఊరెళితే, హనుమాన్ జంక్షన్ ఎప్పుడు టీవీలో వచ్చినా హ్యాపీగా ఇంటిల్లిపాదీ చూసే ఎంటర్ టైనర్లు. ఆ తర్వాత వరస ఫ్లాపులతో వేణు మాయమయ్యాడు.

కట్ చేస్తే 2012లో తిరిగి దమ్ములో కనిపించాడు కానీ అందులో చనిపోయే అంతగా ప్రాధాన్యం లేని పాత్ర కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. దానికి తోడు బొమ్మ కూడా ఫ్లాప్ అయ్యింది. అంతే ఇక వేణు మళ్ళీ కనిపిస్తే ఒట్టు. ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం ఇతను మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఎనర్జిక్ స్టార్ రామ్ ది వారియర్ లో పోలీస్ దుస్తుల్లో కనిపించనున్నాడు. ఎంత నిజమో తెలియదు కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది కీలకమైన క్యారెక్టరే అయినప్పటికీ దమ్ము లాగే ఇందులో కూడా సాడ్ ఎండింగ్ ఉండొచ్చని అంటున్నారు.

సరిగా ప్లాన్ చేసుకోవాలే కానీ వేణుకి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ఇప్పుడు మంచి అవకాశం ఉంది. తెలుగులో అసలే ఆర్టిస్టుల కొరత పెరుగుతోంది. రాజేంద్రప్రసాద్, నరేష్, రావు రమేష్, జగపతిబాబు ఎంతసేపూ వీళ్ళనే కంటిన్యూ చేయాల్సి వస్తోంది. శ్రీకాంత్ ఈ మధ్య జోరు పెంచాడు. సో వేణు కనక సినిమాలను జాగ్రత్తగా ఎంచుకుంటే ఆఫర్లు వస్తాయి. ది వారియర్ ఫలితం కూడా ఇక్కడ కీలకం కానుంది. ఈ సినిమా ప్రమోషన్ల కోసమే ఎన్నడూ లేనిది వేణు ప్రత్యేకంగా మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు.