సూర్య ది గ్రేట్.. ఆస్కార్ కమిటీలో చోటు

తెలుగు వారికి కూడా సుప‌రిచితుడైన త‌మిళ స్టార్ హీరో సూర్య అరుదైన ఘ‌న‌త సాధించారు. ఆస్కార్ అవార్డుల నిర్వాహ‌కుల నుంచి 2022 సంవ‌త్స‌రానికి ఆయ‌న ఆహ్వానం అందుకున్నాడు. ఐతే ఈ ఆహ్వానం కేవ‌లం ఈ వేడుక‌కు హాజ‌ర‌వ‌మ‌ని కాదు. ఆస్కార్ అవార్డులను ఎంపిక చేసే అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (ఏఎంపీఏఎస్‌)లో స‌భ్యుడిగా సూర్య‌కు ఆహ్వానం అందింది. ఈ ఘ‌న‌త సాధించిన తొలి ద‌క్షిణాది న‌టుడు సూర్య‌నే కావ‌డం విశేషం.

సౌత్ నుంచి ఆస్కార్ అవార్డుల వేడుకకు ఆహ్వానం అందుకున్న తొలి న‌టుడిగా మెగాస్టార్ చిరంజీవి రికార్డు నెల‌కొల్పాడు. ఆయ‌నకు 1980లోనే ఈ మేర‌కు ఆహ్వానం అందింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ నుంచి ప‌లువురు ఇలా ఆహ్వానం అందుకున్నారు. ఐతే ద‌క్షిణాది నుంచి ఆస్కార్ అవార్డుల క‌మిటీకి ఇప్ప‌టిదాకా ఎవ్వ‌రూ ఎంపిక కాలేదు. ఈ సంవ‌త్స‌రానికి ఇండియా నుంచి ఈ మేర‌కు పిలుపు అందుకున్న‌ది ఒక్క సూర్య మాత్ర‌మే కాదు. బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి కాజోల్‌తో పాటు త‌లాష్‌, గోల్డ్ లాంటి సినిమాలు రూపొందించిన మ‌హిళా ద‌ర్శ‌కురాలు రీమా క‌గ్తి కూడా ఈసారి ఆస్కార్ అవార్డుల క‌మిటీ నుంచి ఆహ్వానం అందుకున్నారు.

సూర్య సినీ ప్ర‌యాణం గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. మొద‌ట్లో న‌టుడిగా చిన్న స్థాయి సినిమాలే చేశాడ‌త‌ను. బాల రూపొందించిన‌ నంద నుంచి అత‌డి ప్ర‌యాణం మారిపోయింది. గ‌జిని సినిమాతో సౌత్ అంత‌టా అత‌డి పేరు మార్మోగిపోయింది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా చేరువ‌య్యాడు. ఆ త‌ర్వాత మ‌న ప్రేక్ష‌కులు ఇక్క‌డి స్టార్ల త‌ర‌హాలో అత‌ణ్ని ఆద‌రించారు. గ‌త కొన్నేళ్ల‌లో అత‌డి జోరు కొంచెం త‌గ్గింది. ఐతే ఆకాశం నీ హ‌ద్దురా సినిమాతో సూర్య అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించాడు. ఆ చిత్రం ఆస్కార్ అవార్డుల రేసులో కూడా నిలిచింది. ప‌లు అవార్డుల‌ను సొంతం చేసుకుంది. చివ‌ర‌గా హీరో ఈటి సినిమాతో ప‌ల‌క‌రించిన సూర్య‌.. ప్ర‌స్తుతం వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.