మ‌హేష్.. భ‌లే క‌మ‌ర్షియ‌ల‌బ్బా

టాలీవుడ్లో బాగా క‌మ‌ర్షియ‌ల్ అని పేరున్న హీరోల్లో ప్ర‌ముఖంగా మ‌హేష్ బాబు పేరే వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా న‌మ్ర‌త శిరోద్క‌ర్‌ను పెళ్లాడాక అత‌ను క‌మ‌ర్షియ‌ల్ అయ్యాడ‌ని అంటారు. ఆమె రాక‌తోనే మ‌హేష్‌కు త‌న బ్రాండ్ వాల్యూ ఏంటో తెలిసి పారితోష‌కాలు పెంచ‌డం.. సినిమాల్లో నిర్మాణ భాగ‌స్వామిగా మార‌డం.. అలాగే పెద్ద ఎత్తున క‌మ‌ర్షియ‌ల్స్ చేయ‌డం.. మ‌ల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి కూడా దిగ‌డం చేశాడు.

మ‌హేష్ ఏం చేసినా అందులో వాణిజ్య ప్రయోజ‌నం ఉంటుంద‌ని కామెంట్లు చేస్తుంటారు నెటిజ‌న్లు. తాజాగా అత‌ను పంచుకున్న ఓ స‌ర‌దా ఫొటో కూడా అందులో భాగ‌మే కావడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

త‌న భార్య న‌మ్ర‌త‌తో క‌లిసి వాషింగ్ మెషీన్ ముందు మ‌హేష్ షార్ట్స్‌లో నిల‌బ‌డ్డ ఆఫ్ బీట్ ఫొటో అది. మెషీన్ బ్రాండ్ స‌రిగా క‌నిపించ‌లేదు కానీ.. దాని మీద మాత్రం ఏరియ‌ల్ బ్రాండ్ పౌడ‌ర్ ఉంది. ముందు ఇది మామూలు ఆఫ్ బీట్ ఫొటో అనే అంతా అనుకున్నారు. ఎందుకంటే అది అంత స‌హ‌జంగా క‌నిపిస్తోంది. న‌మ్ర‌త వాషింగ్ మెషీన్‌లోకి బ‌ట్ట‌లు వేసే క్ర‌మంలో మ‌హేష్ దాన్ని గ‌మ‌నిస్తున్న‌ట్లు అనిపించింది.

కానీ అది ఏరియ‌ల్ బ్రాండ్ ప్ర‌మోష‌న్లో భాగంగా దిగిన పొటో అనే విష‌యం త‌ర్వాత వెల్ల‌డైంది. మ‌హేష్‌-న‌మ్ర‌త మాత్రమే కాదు.. నాగ‌చైత‌న్య‌-స‌మంత సైతం ఇదే ఏరియ‌ల్ బ్రాండ్ కోసం ప్ర‌చారంలో భాగంగా ఇలాంటి ఫొటోనే దిగ‌డంతో విష‌యం అంద‌రికీ బోధ‌ప‌డింది. ప్రమోష‌న్ పేరు చెప్ప‌కుండా సెల‌బ్రెటీలు ఇలా క్యాజువ‌ల్ ఫొటోల‌న్న‌ట్లుగా రిలీజ్ చేసి త‌మ ఫాలోవ‌ర్ల‌కు మస్కా కొట్ట‌డం క‌రెక్టేనా అన్న చ‌ర్చ న‌డుస్తోందిప్పుడు.