మాధవన్‌పై ఓ రేంజ్ ట్రోలింగ్

విలక్షణ నటుడు మాధవన్ ఈ మధ్య తరచుగా సోషల్ మీడియాకు టార్గెట్ అయిపోతున్నాడు. ఇటీవల కేన్ ఫిలిం ఫెస్టివల్‌లో తన కొత్త చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ను ప్రమోట్ చేసుకునేందుకు వెళ్లిన మాధవన్.. అక్కడ మోడీ సర్కారుకు మద్దతుగా మాట్లాడడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల ముందు డిజిటల్ మనీని ప్రవేశపెట్టినపుడు అందరూ ఎగతాళి చేశారని.. ఇండియాలో ఇది వర్కవుట్ కాదని అన్నారని.. కానీ ఇప్పుడు పల్లెటూళ్లలో కూడా దాన్ని వాడుతున్నారని పేర్కొంటూ మోడీ సర్కారుకు మాధవన్ ఎలివేషన్ ఇవ్వడం చాలామందికి నచ్చలేదు. అతడి మీద ‘భక్త్’గా ముద్ర వేసి నెటిజన్లు ట్రోల్ చేశారు. కరోనా టైంలో డిజిటల్ మనీ అనివార్యంగా మారి అందరూ వాడారు తప్ప అందులో మోడీ ప్రభుత్వం క్రెడిట్ ఏమీ లేదని.. డీమానిటైజేషన్ లాంటి వ్యవహారాల్లో మోడీ సర్కారు వైఫల్యం సంగతేంటని మాధవన్‌ను ప్రశ్నించారు.

ఆ వ్యవహారం అంతటితో ముగియగా.. ఇప్పుడు అంతరిక్ష పరిశోధనల్లో భారత్ సాధించిన ప్రగతి గురించి ఓ కార్యక్రమంలో మాధవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా ట్రోలింగ్‌కు కారణం అయ్యాయి. మార్స్ మీదికి ఉపగ్రహాన్ని పంపడం కోసం రష్యా సహా ప్రపంచ దేశాలు భారీగా ఖర్చు పెట్టాయని 30 సార్లకు పైగా ప్రయత్నించాక కొంతమేర విజయవంతం అయ్యాయని.. అప్పుడు కూడా ఒక స్థాయి ఎత్తుకు మించి ఉపగ్రహాన్ని పంపలేకపోయాయని.. కానీ ఇండియా మాత్రం 2014లో చాలా తక్కువ ఖర్చుతో, తక్కువ ప్రయత్నాల్లోనే మార్స్ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిందని మాధవన్ పేర్కొన్నాడు. ఇందుకు కారణం వివరిస్తూ భారత శాస్త్రవేత్తలు పంచాంగాన్ని అనుసరించి ఈ మిషన్ చేపట్టారని.. అందుకే అధునాతన సాంకేతిక ఉన్న ప్రపంచ దేశాల కంటే భారత్ తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో వాళ్లను మించి మిషన్‌ను విజయవంతం చేసిందని మాధవన్ పేర్కొన్నాడు.

ఐతే మాధవన్ మాటలన్నీ చాలా అసత్యాలు ఉన్నాయని.. మోడీ ప్రభుత్వ హయాంలో సాంకేతికంగా కూడా దేశం ముందుకెళ్లిపోయిందని ఎలివేషన్ ఇవ్వడానికి, ఈ క్రమంలో తన ‘రాకెట్రీ’ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి మాధవన్ ప్రయత్నిస్తున్నాడని.. ఇన్నాళ్లూ మంచి ఆలోచనా పరుడిగా కనిపించిన మాధవన్.. ఇప్పుడిలా తయారయ్యాడేంటని నెటిజన్లు అతణ్నితెగ ట్రోల్ చేస్తున్నారు.