పరిశ్రమపై బయోపిక్కుల వర్షం

అసలు బయోపిక్కుల మూలాలు ఎక్కడ మొదలయ్యాయో కానీ కథల కొరతతో అల్లాడుతున్న పరిశ్రమకు సెలబ్రిటీల జీవితాలే ఆధారమవుతున్నాయి. ఇప్పటికే చాలా వచ్చాయి. మహానటి, మల్లేశం, ఎంఎస్ ధోని, ఎన్టీఆర్, పాన్ సింగ్ తోమర్, మేరీ కోమ్, అజారుద్దీన్, సచిన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు అవుతుంది. వీటిలో బ్లాక్ బస్టర్లున్నాయి డిజాస్టర్లున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే జనానికి ఇవి క్రమంగా బోర్ కొడుతున్న ఉదంతాలే ఎక్కువ. అయినా కూడా రచయితలు దర్శకులు వెనుకాడటం లేదు.

ఇప్పటికిప్పుడు నిర్మాణంలో ఉన్నవి త్వరలో ప్రారంభం కాబోయేవి చూస్తే పదిహేనుకి పైగానే ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇటీవలే రిటైర్మెంట్ తీసుకున్న లేడీ క్రికెటర్ మిథాలీ రాజ్ కథను శభాష్ మితు పేరుతో వచ్చే నెల విడుదల చేయబోతున్నారు. సౌరవ్ గంగూలీకి సంబంధించిన స్క్రిప్ట్ ఆల్రెడీ పూర్తి చేశారు. బందిపోటు రాణి పూలన్ దేవిని హత్య చేసిన నిందితుడు పంకజ్ సింగ్ పున్దిర్ రియల్ స్టోరీ షేర్ సింగ్ రానాగా వస్తోంది. రియాలిటి కమెడియన్ కపిల్ శర్మ జర్నీని ఫన్కార్ లో చూపించబోతున్నారు.

ప్రముఖ చెఫ్ కం రచయిత్రి తర్ల దలాల్ ని ఆవిడ ఇంటి పేరుతోనే వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఇవి కాకుండా మహాత్మా పూలే, ఉషా మెహతా, సుబ్రతా రాయ్, సితార దేవి, సరోజ్ ఖాన్, రాకేష్ మరియా, ఆదేశ్ శ్రీవాత్సవ, శ్రీకాంత్ బొల్ల, జిఆర్ గోపి నాధ్, కేఫ్ కాఫీ డే అధిపతి విజి సిద్దార్థ తదితర ప్రముఖులను స్క్రీన్ పై చూపించబోతున్నారు. ఇవన్నీ అఫీషియల్ గా లాక్ చేసినవి. ఇంకా చర్చల దశల్లో ఉన్నవి పదికి పైగానే ఉంటాయి. చూస్తుంటే ఈ బయోపిక్కుల ప్రవాహం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు.