నాని రీమేక్ సినిమాకు ఘోర పరాభవం

ఒక భాషలో హిట్టయిన సినిమా ఇంకో భాషలో విజయవంతం అవుతుందన్న గ్యారెంటీ ఎప్పుడూ ఉండదు. అందరు ప్రేక్షకులూ అన్ని భాషల చిత్రాలనూ చూసేస్తున్న ఈ ఓటీటీ కాలంలో రీమేక్ సినిమాల పట్ల ఆసక్తి అంతకంతకూ తగ్గిపోతోంది. ఇలాంటపుడు కాస్త వైవిధ్యం ఉండి, స్థానిక ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్పులు చేర్పులు చేసి రీమేక్‌ను తీర్చిదిద్దితే తప్ప రీమేక్‌తో హిట్ కొట్టడం కష్టం.

ఇలాంటి తరుణంలో తెలుగులో సక్సెస్ అయింది కదా అని నాని చిత్రం ‘ఎంసీఏ’ను గుడ్డిగా హిందీలో రీమేక్ చేసి బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం ఎదుర్కొంది చిత్ర బృందం. నాని మంచి ఊపులో ఉండగా.. బాక్సాఫీస్ దగ్గర అన్నీ కలిసొచ్చి ‘ఎంసీఏ’ పెద్ద హిట్టయింది కానీ.. నిజానికి అది చాలా సాధారణమైన సినిమా. రొటీన్ కథాకథనాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాని ఫిల్మోగ్రఫీలో చాలా దిగువన పెట్టాలనే చెప్పాలి. అలాంటి సినిమాను రీమేక్ చేసి తల బొప్పి కట్టించుకున్నాడు దర్శక నిర్మాత అహ్మద్ ఖాన్.

హిందీలో అభిమన్యు దాసాని కథానాయకుడిగా ‘నికమ్మ’ పేరుతో ‘ఎంసీఏ’ రీమేక్ అయింది. సాయిపల్లవి పాత్రను షెర్లీ సెటియా, భూమిక క్యారెక్టర్ని శిల్పా శెట్టి చేశారు హిందీలో. దీని ట్రైలర్ చూసినపుడే చాలా పేలవంగా అనిపించింది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది ఈ సినిమా గురించి. ఐతే సినిమా తీశారు కాబట్టి జనాల్లోకి తీసుకెళ్లాల్సిందే అని.. శిల్పా, అభిమన్యు కలిసి గట్టిగా ప్రమోట్ చేశారు. కానీ శుక్రవారం విడుదలైన ‘నికమ్మ’ పబ్లిసిటీ కోసం పెట్టిన ఖర్చును కూడా రాబట్టలేకపోయింది.

దేశవ్యాప్తంగా ఈ సినిమాకు తొలి రోజు వచ్చిన వసూళ్లు కేవలం రూ.25 లక్షలు. విమర్శకులు ఈ సినిమాను చీల్చి చెండాడారు. ప్రేక్షకులు సైతం సినిమాను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక సినిమా పుంజుకునే అవకాశాలు లేనట్లే. ఫుల్ రన్లో కోటి రూపాయలు వసూలు కావడం కూడా కష్టంగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇదెంత పెద్ద డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు. ‘జెర్సీ’ లాంటి క్లాసిక్‌ను రీమేక్ చేస్తేనే పట్టించుకోని హిందీ ప్రేక్షకులు.. ‘ఎంసీఏ’ లాంటి సాధారణ చిత్రాన్ని హిందీలో తీస్తే ఎలా హిట్ చేస్తారు మరి?