కమెడియన్ పృథ్వీ కెరీర్ కొన్నేళ్ల ముందు మంచి స్పీడు మీద ఉండేది. ‘లౌక్యం’ సహా కొన్ని చిత్రాల్లో అతడి పాత్రలు భలేగా పేలడంతో అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. బ్రహ్మానందం జోరు తగ్గుతున్న సమయంలో వచ్చిన ఈ అవకాశాలను అతను బాగానే ఉపయోగించుకుంటున్నట్లు కనిపించాడు. పృథ్వీ టాలీవుడ్ టాప్ కమెడియన్లలో ఒకడిగా ఎదుగుతుండగా.. ఆయనకు రాజకీయాల మీద మనసు మళ్లింది.
2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలి బాగా వీచేలా ఉందని గ్రహించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. ఆ అంచనాలు ఫలించి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో చురుగ్గా వ్యవహరించినందుకు పృథ్వీకి ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్ పదవి దక్కింది. కానీ ఈ పదవి ఆయనకు మూణ్నాళ్ల ముచ్చటే అయింది. ఆ పదవిలో ఉంటూ ఒక మహిళతో ఫోన్లో అసభ్యంగా సంభాషించాడన్న కారణంతో ఆయనపై వేటు వేసింది టీటీడీ. తర్వాత కథ అందరికీ తెలిసిందే.
ఈ మధ్య పృథ్వీ మాట తీరు పూర్తిగా మారింది. రాజకీయాల్లోకి వెళ్లి తప్పు చేశానని.. సినీ రంగమే తనకు కరెక్ట్ అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మీద చేసిన విమర్శలను కూడా అతను వెనక్కి తీసుకున్నాడు. దీని ప్రభావమో ఏమో కానీ.. పృథ్వీకి మళ్లీ అవకాశాలైతే వస్తున్నాయి. తాజాగా రిలీజైన ‘గాడ్సే’ సినిమాలో పృథ్వీ చిన్న కామెడీ రోల్ చేశాడు. భారీ పరిశ్రమల శాఖా మంత్రిగా కనిపించిన అతను.. తన మీద తనే సెటైర్లు వేసుకోవడం విశేషం. ‘‘నేను వెనుక నుంచి వాటేసుకుందామనుకుంటే నా కొంపముంచారు..’’ అనే మాట ఆయన్నుంచి రావడం విశేషం. ఇలాంటి డైలాగే సినిమాలో మరొకటి కూడా ఉండడం విశేషం.
ఒక సీన్లో ఓ అమ్మాయి మైనే పీచే పక్డో అని అడిగితే.. ఒక్కసారి వెనుక నుంచి వాటేసుకుంటా అన్నందుకే తెలుగు రాష్ట్రాలు గగ్గోలు పెట్టాయి. నువ్వు కూడా ఆ పని చేస్తే దేశమంతా నా గురించి మాట్లాడుకుంటుంది వద్దు తల్లీ.. అంటూ పృథ్వీ డైలాగ్ పేల్చడం విశేషం. పృథ్వీకి ఎంత జ్ఞానోదయం అయినా సరే.. ఇలా తన మీద తాను పంచ్ వేసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates