ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజయ్యే సినిమా అంటే ఒక రకమైన చిన్న చూపు వచ్చేసింది జనాలకు. ఈ కోవలో రిలీజవుతున్న ప్రతి సినిమా ప్రతికూల ఫలితం అందుకుంటుండటంతో వాటి పట్ల నెగెటివ్ ఫీలింగ్ పడిపోయింది. ‘అమృతారామమ్’ మొదలుకుని.. ‘పెంగ్విన్’ వరకు నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో రిలీజైన ఏ సినిమా కూడా సానుకూల స్పందన తెచ్చుకోలేదు.
దీంతో థియేటర్లలో రిలీజ్ చేస్తే మంచి ఫలితాన్ని అందుకుంటాయన్న కాన్ఫిడెన్స్ లేని చిత్రాలనే ఇలా రిలీజ్ చేస్తున్నారనే భావన జనాల్లో వచ్చేసింది. ఈ సినిమాల విషయంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కూడా పునరాలోచించడం మొదలైంది. ముందులా మంచి డీల్స్ కూడా రావట్లేదని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఇలాంటి సమయంలో డైరెక్ట్ ఓటీటీ సినిమాల పట్ల అందరి దృక్పథాన్ని మార్చింది ‘కృష్ణ అండ్ హిజ్ లీల’.
ఇంతకుముందు నేరుగా ఓటీటీల్లో రిలీజైన చిత్రాలకు భిన్నంగా దీన్ని విడుదల చేశారు. ముందు రిలీజ్ డేట్ ఇవ్వలేదు. ఏ ఫ్లాట్‌ఫామ్‌లో వస్తుందని ప్రకటించలేదు. మొన్న ఉన్నట్లుండి అర్ధరాత్రి చడీచప్పుడు లేకుండా నెట్‌ప్లిక్స్‌లోకి వదిలేశారు. ఏ అంచనాలు లేకుండా అనుకోకుండా సినిమా చూసిన జనాలకు అది బాగానే ఎక్కేసింది. గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన బెస్ట్ రొమాంటిక్ కామెడీస్లో ఇదొకటని అంటున్నారు.
రివ్యూలన్నీ పాజిటివ్‌గానే ఉన్నాయి. సోషల్ మీడియాలో జనాల స్పందన కూడా బాగుంది. చిత్ర బృందం ప్రచారం చేసుకుంటున్నట్లుగా ఫస్ట్ డిజిటల్ బ్లాక్‌బస్టర్ అనలేం కానీ.. ఈ ఫ్లాట్ ఫాంలో ఫస్ట్ హిట్ అని మాత్రం చెప్పొచ్చు. ఇప్పటికే ఓటీటీ రిలీజ్ కన్ఫమ్ చేసుకున్న చిత్రాలకు.. విడుదలకు సన్నాహాల్లో ఉన్న చిత్రాలకు ఊరటనిచ్చే విషయమే. ఇలా ఇంకో రెండు మూడు మంచి సినిమాలు పడితే.. ఆ తర్వాత మరిన్ని సిినిమాలు ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యే అవకాశముంది.