నాని ‘పాన్ ఇండియా’ పంచ్

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ముందుగా దర్శకత్వ శాఖలో పని చేసి.. ఆ తర్వాత అనుకోకుండా హీరోగా అరంగేట్రం చేసి.. ‘అష్టాచెమ్మా’తో తొలి ప్రయత్నంలోనే అందరినీ ఆకట్టుకుని.. ఆ తర్వాత కొంతకాలం నెమ్మదిగా అడుగులు.. ఆపై సినిమా సినిమాకూ ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగాడు నాని. కేవలం తెరపై బాగా నటించడం మాత్రమే కాదు.. బయట బాగా మాట్లాడడం, చక్కటి నడవడిక ద్వారా నాని తన స్థాయిని పెంచుకున్నాడు.

టాప్ స్టార్లు అయ్యుండి కొంతమంది కొన్ని అంశాలపై మాట్లాడాల్సిన సమయంలోనూ మాట్లాడకుండా మౌనంగా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల ధరల సమస్య మీద ఓపెన్‌గా తన అభిప్రాయం చెప్పడం ద్వారా హీరో అయ్యాడు నాని. ఈ విషయాన్ని కావాలని వివాదాస్పదంగా మార్చిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ నాని సరిగ్గానే మాట్లాడాడన్నది మెజారిటీ అభిప్రాయం. ఇప్పుడు ఈ విషయంపై నాని క్లారిటీ ఇచ్చాడు.

దీంతో పాటుగా నాని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ మధ్య అందరూ పాన్ ఇండియా పాన్ ఇండియా అంటూ తమ సినిమాల గురించి ఊదరగొట్టేస్తుండటం గురించి నాని తనదైన శైలిలో పంచ్ వేశాడు. ఊరికే పోస్టర్ల మీద పాన్ ఇండియా ఫిలిం అని వేసుకుంటే.. బయట ప్రచారం చేసుకుంటే.. అవి పాన్ ఇండియా సినిమాలు అయిపోవని నాని అన్నాడు.

‘పుష్ప’ సినిమా కథ చిత్తూరు ప్రాంతంలో ఉండే శేషాచలం అడవుల చుట్టూ, ఇక్కడి మనుషుల చుట్టూ తిరుగుతుందని.. కానీ ఆ సినిమాను దేశమంతా ఆదరించిందని.. దీన్ని బట్టి ఏ ప్రేక్షకులకైనా కనెక్ట్ అయ్యే ఎమోషన్ సినిమాలో ఉండడం కీలకమని.. అప్పుడు భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని.. అంతే తప్ప ఎవరికి వాళ్లు తమది పాన్ ఇండియా సినిమా అనేస్తే.. పోస్టర్ల మీద వేసేస్తే లాభం లేదని నాని స్పష్టం చేశాడు. కాబట్టి అందరూ కంటెంట్ మీద దృష్టిపెట్టాలని.. అప్పుడు ఆటోమేటిగ్గా సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ఆడుతాయని నాని అన్నాడు.