బాలీవుడ్‌కు బాక్సాఫీస్ దగ్గర మామూలు షాకులు తగలట్లేదు ఈ మధ్య. కొవిడ్ కారణంగా అక్కడి సినిమా థియేట్రికల్ బిజినెస్ బాగా దెబ్బ తినేసింది. ఏడాదిన్నరకు పైగా అక్కడ థియేటర్లు మూతపడి ఉన్నాయి. అవి పున:ప్రారంభం అయ్యాక బాగా ఆడిన హిందీ సినిమాలు వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. సూర్యవంశీ, కశ్మీర్ ఫైల్స్, ఈ మధ్యే వచ్చిన భూల్ భూలయియా-2 మాత్రమే మంచి వసూళ్లు సాధించాయి. మిగతావన్నీ టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. తాజాగా ‘అనేక్’ రూపంలో బాలీవుడ్‌కు మరో షాక్ తప్పలేదు.
ఓవైపు పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి సౌత్ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్న హిందీ ప్రేక్షకులు.. తమ భాషలో తెరకెక్కుతున్న సినిమాలను పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. వాళ్లు లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్లు, హీరోయిజం, ఎలివేషన్లు, యాక్షన్ ఘట్టాలు, మాస్ ఎంటర్టైన్మెంట్ ఉన్న చిత్రాలకే పట్టం పడుతున్నారు. అలాంటి సినిమాలు సౌత్‌లోనే ఎక్కువ తెరకెక్కుతున్నాయి.
పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు కూడా నార్త్ ఇండియన్ బాక్సాఫీస్‌లో బోల్తా కొడుతూ.. బాలీవుడ్ నిర్మాతలకు బెంబేలెత్తిస్తున్న సమయంలో అక్కడి టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడైన సాజిద్ నడియాడ్‌వాలా కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన నిర్మాణంలో తెరకెక్కుతున్న అరడజను చిత్రాలకు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసేస్తున్నాడు. ఈ మేరకు అమేజాన్ ప్రైమ్ వాళ్లతో అతను ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగా కొన్ని రోజుల పాటు అదనపు రుసుముతో ‘రెంట్’ ఆప్షన్ ద్వారా ఈ చిత్రాలను చూడొచ్చు.
ఆ తర్వాత సబ్‌స్క్రైబర్లకు ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తారు. గత రెండేళ్లలో పెద్ద సినిమాలు చాలానే నేరుగా ఓటీటీల్లో రిలీజయ్యాయి. ఐతే అందుకు ప్రధాన కారణం కొవిడే. థియేటర్లు అందుబాటులో లేకే వాటిని ఓటీటీల్లో రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తున్నా సరే.. వాటిలో సినిమాలు రిలీజ్ చేసి ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టడం కష్టమైపోతోంది. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీల్లో సినిమాలను రిలీజ్ చేస్తే బిగ్ డీల్స్ దక్కుతున్నాయి.
థియేటర్ల నుంచి నామమాత్రంగా వచ్చే ఆదాయానికి ఆశపడడం కంటే ఇలా రిలీజ్ చేసుకుని లాభపడాలని సాజిద్ నిర్ణయించుకున్నట్లున్నాడు. సాజిద్ అంటే భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. అలాంటి నిర్మాత అరడజను సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం కీలక పరిణామమే. దీని పట్ల ఎగ్జిబిటర్ల నుంచి విమర్శలు వస్తున్నా.. తనకు ఏది ప్రయోజనకరమో అది చూసుకోవడం నిర్మాత హక్కని బాలీవుడ్ వర్గాలు వాదిస్తున్నాయి.