జాతిర‌త్నాలు డైరెక్ట‌ర్.. కొత్త సినిమా రెడీ!

‘పిట్టగోడ’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు అనుదీప్ కేవీ. బిగ్ బాస్ ఫేమ్ పుణర్నవి కథానాయికగా నటించిన చిత్రమది. ఆ సినిమా రిలీజైనట్లుగా కూడా చాలామందికి తెలియదు. ప్రేక్షకుల దృష్టిలో పడకుండానే ఆ సినిమా వచ్చింది, వెళ్లిపోయింది. ఇలాంటి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అనుదీప్‌కు ఇంకో సినిమా ఛాన్స్ వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. కానీ అతను ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌ను మెప్పించి తన నిర్మాణంలో ‘జాతిరత్నాలు’ చేశాడు.

ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంతో అతడి రేంజ్ మారిపోయింది. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో తమిళ, తెలుగు భాషల్లో పెద్ద బడ్జెట్లో ఓ ద్విభాషా చిత్రం చేసే అవకాశం దక్కించుకున్నాడు. కొన్ని నెలల కిందటే ఆ చిత్రం సెట్స్ మీదికి వెళ్లింది. ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగ్ ఈ చిత్ర నిర్మాత. స్టార్ హీరో సినిమా, పెద్ద బడ్జెట్, పైగా తమిళ-తెలుగు భాషల్లో తెరకెక్కుతోంది కాబట్టి ఈ చిత్రం ఆలస్యం అవుతుందని అనుకున్నారంతా.

కానీ అనుదీప్ జెట్ స్పీడులో ఈ సినిమాను పూర్తి చేసేసినట్లు తెలుస్తోంది. చిత్రీకరణ చివరి దశకు వచ్చేయడంతో సినిమాకు రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు. వినాయక చవితి కానుకగా ఆగస్టు 31న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించారు. అదే రోజు తమిళంలో కార్తి సినిమా ‘విరుమాన్’ కూడా రిలీజవుతోంది.

దాన్ని తెలుగులో కూడా విడుదల చేస్తారు. వినాయక చవితి వీకెండ్ అంటే.. తెలుగులో ఇంకా ఒకటో రెండో పేరున్న సినిమాలే రిలీజ్ కావచ్చు. ‘వరుణ్ డాక్టర్’, ‘డాన్’ సినిమాలతో శివ కార్తికేయన్‌కు తెలుగులో మంచి గుర్తింపే వచ్చింది. దీనికి తోడు అనుదీప్ సినిమా కావడంతో తెలుగులో పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేసే అవకాశముంది. మరి ఈ చిత్రంతో అనుదీప్ ఏమేర అంచనాలు అందుకుంటాడు.. శివకార్తికేయన్ తొలి తెలుగు చిత్రంతో ఎలాంటి ముద్ర వేస్తాడు.. చూద్దాం మరి.