హీరోయిన్ల స‌ర్జ‌రీల‌పై రాధికా ఆప్టే మరో కౌంటర్

హీరో హీరోయిన్లు అందం కాపాడుకోవ‌డానికి, పెంచుకోవ‌డానికి కాస్మొటిక్ స‌ర్జ‌రీలను ఆశ్ర‌యించ‌డం మామూలే. హాలీవుడ్ హీరోయిన్ల నుంచి అందిపుచ్చుకున్న ఈ ఒర‌వ‌డిని.. ఇప్పుడు ప్ర‌తి ఫిలిం ఇండ‌స్ట్రీల్లోనూ అనుస‌రిస్తున్నారు. హీరోయిన్ల‌కు అవ‌కాశాలు తెచ్చిపెట్టేది ప్ర‌ధానంగా అంద‌మే కాబ‌ట్టి.. వాళ్లు ఇంకా ఎక్కువ‌గా స‌ర్జ‌రీల బాట ప‌డుతుంటారు.

అల‌నాటి శ్రీదేవి నుంచి ఇప్ప‌టి శ్రుతి హాస‌న్ వ‌ర‌కు కాస్మొటిక్ స‌ర్జ‌రీల‌తో రూపు మార్చుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు. కొంద‌రు ఈ స‌ర్జ‌రీల విష‌యంలో ఓపెన్ అయిపోతుంటారు. కొంద‌రు గుట్టుగా దాచే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ఐతే ఇలాంటి వాటి జోలికి వెళ్ల‌కుండా ఉన్న అందంతోనే స‌రిపెట్టుకుని త‌మ పెర్ఫామెన్స్‌ను మాత్ర‌మే న‌మ్ముకునే హీరోయిన్లు కొంద‌రుంటారు. రాధికా ఆప్టే ఆ కోవ‌కే చెందుతుంది.

ఐతే ఎవ‌రి దారి వాళ్ల‌ది అని ఊరుకోకుండా కాస్మొటిక్ స‌ర్జ‌రీలు చేయించుకునే హీరోయిన్ల మీద ఈ మ‌ధ్య త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తోంది రాధికా ఆప్టే. గ‌తంలోనూ ఒక‌సారి ఆమె ఈ విష‌య‌మై కౌంట‌ర్లు వేసింది. హీరోయిన్లు పెట్టే నో ఫిల్ట‌ర్ ఫొటోల గురించి విమ‌ర్శ‌లు చేస్తూ.. అదేం పెద్ద విష‌యం కాదని, అంత‌కంటే ముందు స‌ర్జ‌రీలు చేయించుకోవ‌డం హీరోయిన్లు మానాలని ఆమె వ్యాఖ్యానించ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

ఇప్పుడు మ‌రోసారి స‌ర్జ‌రీలు చేయించుకునే హీరోయిన్ల‌పై ఆమె కౌంటర్లు వేసింది. ‘‘నాకు తెలిసి ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు సర్జరీ చేయించుకున్నవారే. అవకాశాల కోసం, పాపులారిటీ పెంచుకోవ‌డానికి ముఖంతో పాటు శరీరంలో చాలా చోట్ల‌ సర్జరీలు చేసుకుంటున్నారు. వయసు కనిపించకుండా ఉండటానికే వాళ్లు ఇదంతా చేస్తున్నారు. కానీ ఆ ప‌ని నేను చేయ‌లేను. ఇలా సర్జరీలు చేయించుకున్న హీరోయిన్లను చూసి చూసి విసిగిపోయాను’’ అని రాధిక పేర్కొంది.