ఆమిర్ ఖాన్‌కు అదే పెద్ద మైన‌స్‌


క‌థ‌ల ఎంపిక‌లో గొప్ప ప‌నిత‌నం చూపిస్తూ, పాత్ర‌ల్లో జీవిస్తూ భార‌తీయ ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నాడు ఆమిర్ ఖాన్. అత‌ణ్ని మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్ట్ అని ఊరికే అనేయ‌రు జ‌నాలు. కెరీర్లో ఒక ద‌శ వ‌ర‌కు అంద‌రిలో ఒక‌డిలాగే క‌నిపించిన ఆమిర్.. ‘లగాన్’ ద‌గ్గ‌ర్నుంచి త‌న పంథాను మార్చాడు. ఆ సినిమాతో ఆమిర్‌కు వ‌చ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఆ త‌ర్వాత 3 ఇడియ‌ట్స్, పీకే, దంగ‌ల్ లాంటి మెగా హిట్ల‌తో ఆమిర్ ఇండియ‌న్ ఫిలిం హిస్ట‌రీలోనే తిరుగులేని స్టార్ల‌లో ఒక‌డిగా ఎదిగాడు.

చివ‌ర‌గా అత‌ను చేసిన ‘థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్’ తుస్సుమ‌నిపించినా.. ఆ త‌ర్వాత అత‌ను మొద‌లుపెట్టిన‌ ‘లాల్ సింగ్ చద్దా’పై భారీ అంచనాలే నెలకొన్నాయి. 90వ దశకంలో హాలీవుడ్లో వచ్చిన ‘ఫారెస్ట్ గంప్’ మూవీకి ఇది అఫీషియల్ రీమేక్. హాలీవుడ్లో ఆమిర్ లాగే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా గొప్ప పేరున్న టామ్ హాంక్స్ నటించిన చిత్రమిది. ఆమిర్ దగ్గర ఒకప్పుడు మేనేజర్‌గా పని చేసిన ‘అద్వైత్ చందన్’ ఈ చిత్రాన్ని రూపొందించాడు.

తాజాగా రిలీజైన ‘లాల్ సింగ్ చద్దా’ ట్రైలర్ హృద్యంగా సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకాన్ని ట్రైలర్ కలిగించింది. కాకపోతే ఆమిర్ ఇంతకుముందు చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘పీకే’ దీనికి ప్రతికూలతగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో వేరే గ్రహం నుంచి భూమి మీదికి వచ్చి పడ్డ అమాయక చక్రవర్తిగా ఆమిర్ ఖాన్ పాత్ర, తన నటన అందరినీ అమితంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘లాల్ సింగ్ చద్దా’లో చేసిన పాత్ర కూడా దానికి చాలా దగ్గరగా కనిపిస్తోంది. ‘పీకే’లో ఆమిర్ పాత్రకు ‘ఫారెస్ట్ గంప్’లో టామ్ హాంక్స్ క్యారెక్టరే స్ఫూర్తి అని అంటారు. అప్పటికే ఆ సినిమా చూసిన వాళ్లు హాంక్స్‌ను ఆమిర్ అనుకరించాడని గట్టిగా నమ్మారు. ఇప్పుడు ‘ఫారెస్ట్ గంప్’ రీమేక్‌లో ఆమిర్‌ను చూస్తుంటే జనాలకు కొత్తగా అనిపించడం లేదు.

‘పీకే’ రాకపోయి ఉంటే.. ఇప్పుడు కచ్చితంగా ఈ సినిమా, పాత్ర కొత్తగా అనిపించేవి. కానీ ముందే ‘పీకే’లో ఆమిర్‌ను ఇలాంటి పాత్రలో చూడటంతో ‘లాల్ సింగ్ చద్దా’ కొత్తగా అనిపించడం లేదు. దీనికి తోడు ఇప్పుడు బాలీవుడ్ పెద్ద సినిమాలకు వరుసగా బాక్సాఫీస్ దగ్గర తిరస్కారం ఎదురవుతుండటం, రీమేక్ సినిమాలనగానే ముందే ఒరిజినల్ చూసేస్తున్న ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ తగ్గిపోతుండటం కూడా ఈ చిత్రానికి ప్రతికూలతలే. మరి వీటిని అధిగమించి ఈ చిత్రం ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.