తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్ ఆరంభంలో ఒడుదొడుకుల ప్రయాణం సాగిస్తున్న సమయంలో.. విలక్షణ దర్శకుడు బాలతో చేసిన రెండు సినిమాలు అతడి కెరీర్‌ను మార్చేశాయి. ముందుగా నంద సోలో హీరోగా అతడికి మంచి విజయాన్ని కట్టబెడితే.. ఆ తర్వాత విక్రమ్ కాంబినేషన్లో చేసిన పితామగన్ అతడికి గొప్ప నటుడిగా పేరు తేవడమే కాక, మరో ఘనవిజయాన్ని కట్టబెట్టింది.
ఆ తర్వాత గజినితో అతడి కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఇలా కెరీర్ ఆరంభంలో తాను నిలదొక్కుకోవడానికి కారణమైన బాల మీద సూర్య ప్రత్యేక అభిమానం చూపిస్తుంటాడు. బాల చాలా ఏళ్లుగా ఫాంలో లేకున్నా, అర్జున్ రెడ్డి రీమేక్ వర్మ విషయంలో అవమానం ఎదుర్కొన్నా.. అతడితో సినిమా చేయడానికి సూర్య ముందుకు వచ్చాడు. తన సొంత బేనర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్‌లో బాల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గత ఏడాది అంగీకారం తెలిపాడు సూర్య.
ఐతే ఈ చిత్రం ఎంతకీ ముందుకు కదల్లేదు. సెట్స్ మీదికి వెళ్లలేదు. స్క్రిప్టు విషయంలో ఒక అవగాహనకు రాకపోవడం, బడ్జెట్ చాలా ఎక్కువ అయ్యేలా ఉండటం, క్రియేటివ్ డిఫరెన్సెస్.. ఇవన్నీ కారణమై ఈ సినిమా ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయినట్లు సమాచారం. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని, ఇప్పటిదాకా ప్రి ప్రొడక్షన్ కోసం పెట్టిన ఖర్చు వృథా అయినా పర్వాలేదని ఈ ప్రాజెక్టును సూర్య క్యాన్సిల్ చేశాడట. ఒకప్పుడు సేతు, నంద, పితామగన్ లాంటి క్లాసిక్స్‌తో కోలీవుడ్ హిస్టరీలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు బాల.
కానీ ఒక దశ దాటాక అతడి సినిమాల్లో పైత్యం ముదిరిపోయింది. అవన్ ఇవన్, పరదేశి, నాన్ కడవుల్ లాంటి సినిమాలు ప్రేక్షకులకు రుచించలేదు. చివరగా అతను అర్జున్ రెడ్డి రీమేక్ తీశాడు. వర్మ పేరుతో తెరకెక్కిన ఆ సినిమా ఔట్ పుట్ చూసి భయపడి నిర్మాత దాన్ని డస్ట్ బిన్‌లో పడేశాడు. ఇక అప్పటి నుంచి మరో సినిమా కోసం ప్రయత్నించి, సూర్యతో ఓకే చేయించుకున్నా.. చివరికి అది కూడా క్యాన్సిల్ అయినట్లు తాజాగా వార్తలొస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates