సీనియర్ హీరో రాజశేఖర్ పరిస్థితి చూసి ఆయన అభిమానులే కాక.. సామాన్య ప్రేక్షకులు కూడా జాలి పడుతున్నారిప్పుడు. గత రెండు దశాబ్దాల్లో ఆయన అందుకున్న చెప్పుకోదగ్గ సక్సెస్‌లు అంటే.. ఎవడైతే నాకేంటి, గరుడ వేగ మాత్రమే. వీటికి ముందు, వెనుక వచ్చిన సినిమాలన్నీ తీవ్ర నిరాశకు గురి చేశాయి. అందులోనూ గత పదేళ్లలో అయితే రాజశేఖర్ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. గరుడవేగ కూడా బడ్జెట్, వసూళ్ల కోణంలో చూసుకుంటే చెప్పుకోదగ్గ సక్సెస్ కాదు. ఆ సినిమాతో కెరీర్ కాస్త పుంజుకున్నట్లు కనిపించినా.. మళ్లీ కల్కితో కింద పడ్డాడు.
ఇప్పుడు శేఖర్ సినిమా ఆయనకు అన్ని రకాలుగా నిరాశనే మిగిల్చింది. కొవిడ్ అనంతరం ఇప్పుడు సినిమాల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీ చిత్రాలకు, స్టార్ వాల్యూ ఉన్న చిత్రాలకు తప్ప ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదు. రాజశేఖర్ లాంటి క్రేజ్ కోల్పోయిన సీనియర్ హీరోల సినిమాలు చూడ్డానికి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదన్నది నిష్ఠుర సత్యం. ఆయన సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా ఆడుతుందన్న గ్యారెంటీ లేదు.
మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో సినిమా (ఆచార్య) చూడ్డానికే ప్రేక్షకులు థియేటర్లకు రాని నేపథ్యంలో రాజశేఖర్ పరిస్థితి చెప్పేదేముంది? ఈ నేపథ్యంలో ఆయన ఇంకా హీరోల వేషాల గురించే ఆలోచిస్తూ కూర్చుంటే కష్టం. జగపతిబాబు, శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్‌ల మాదిరి క్యారెక్టర్, విలన్ రోల్స్‌కు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్లతో పోలిస్తే రాజశేఖర్ ఒకప్పుడు ఎక్కువ స్టార్ ఇమేజ్ ఉన్నవాడే కావచ్చు. కానీ క్రేజ్, మార్కెట్ పూర్తిగా కోల్పోయిన నేపథ్యంలో హీరో వేషాలే వేస్తానంటే కష్టం.
నిజానికి ఇప్పుడు రాజశేఖర్ క్యారెక్టర్, విలన్ రోల్స్ చేస్తే కచ్చితంగా ఆయనకు మంచి డిమాండ్ ఉంటుంది. జగపతిబాబు బాగా బోర్ కొట్టేసినా ఆప్షన్ లేక ఆయన్నే క్యారెక్టర్, విలన్ పాత్రలకు తీసుకుంటున్నారు. కాదంటే పరభాషా నటుల వైపు చూస్తున్నారు. రాజశేఖర్ అలాంటి పాత్రలు పోషిస్తే ఆయనకూ కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులకూ కొత్తగా అనిపిస్తుంది. ఇది అన్ని రకాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి పాత్రే చేస్తే.. ఇలాంటిదే చేస్తా అంటూ కండిషన్లు పెట్టకుండా.. ఓపెన్‌గా ఉండి దర్శకులు, రచయితలు తన కోసం ప్రత్యేక పాత్రలు ఇచ్చేలా చేసుకోవాల్సిన అవసరం రాజశేఖర్‌కు ఉంది.