ఈవీవీ.. ఆలీ బాబా డజను దొంగలు


తెలుగు సినిమా చరిత్రలో కామెడీ చిత్రాల గురించి మాట్లాడితే ముందు గుర్తుకొచ్చేది జంధ్యాల.. ఆ తర్వాత ఈవీవీ సత్యానారాయణ. జంధ్యాలది క్లీన్ కామెడీ అయితే.. ఈవీవీ కామెడీ కొంచెం మసాలా అద్దినట్లుంటుంది. డబుల్ మీనింగ్ డైలాగులు, కొంచెం హాట్ రొమాన్స్ కూడా జోడించి కామెడీ సినిమాలకు మరింత రీచ్ పెంచిన ఘనత ఆయన సొంతం. ‘జంబలకిడిపంబ’ సహా 90వ దశకంలో ఆయన తీసిన కామెడీ సినిమాలు మామూలుగా ఆడలేదు. అలాగే స్టార్ హీరోలతో ‘హలో బ్రదర్’ లాంటి బ్లాక్‌బస్టర్లు కూడా ఇచ్చారాయన.

తన సమకాలీన దర్శకులంతా డౌన్ అయిపోయిన టైంలో కూడా ఆయన ఎవడి గోల వాడిది, కితకితలు, బెండు అప్పారావు లాంటి హిట్లిచ్చారాయన. ఐతే ఇంకా మరిన్ని సినిమాలతో అలరిస్తాడనుకుంటే.. 2011లో గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూశారు. ఆయన లేని లోటును ఇప్పటికీ అభిమానులు ఫీలవుతుంటారంటాన్నది వాస్తవం. ఇక ఈవీవీ తనయుడైన నరేష్ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఈవీవీ ఉండుంటే అతడి కెరీర్ ఒడుదొడులకు లోనయ్యేదే కాదు.

నటుడిగా నరేష్ 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన నరేష్.. తండ్రి లేని లోటు గురించి, చనిపోవడానికి ముందు ఆయన ప్రణాళికల గురించి మాట్లాడాడు. దర్శకుడిగా కంటే తండ్రిగానే ఈవీవీని ఎక్కువ మిస్సవుతున్నట్లు చెప్పిన నరేష్.. చనిపోవడానికి ముందు ఆయన రాసుకున్న కథలు, వాటి టైటిళ్లకు సంబంధించిన జ్ఞాపకాలు ఇంకా తమ ఇంట్లో పదిలంగా ఉన్నట్లు చెప్పాడు. ఈవీవీ కెరీర్ సూపర్ హిట్లలో ఒకటిగా నిలిచిన ‘ఆలీబాబా అరడజను దొంగలు’కు కొనసాగింపుగా ‘ఆలీబాబా డజను దొంగలు’ అనే సినిమా తీయాలని ఈవీవీ అనుకున్నట్లు నరేష్ వెల్లడించాడు.

ఐతే ఈ చిత్రానికి స్క్రిప్టు ఉన్నప్పటికీ.. అలాంటి కథల్ని, అంతమంది నటులను మేనేజ్ చేస్తూ సినిమాలు తీసేవాళ్లు ఇప్పుడు ఉన్నారా అని ప్రశ్నించాడు నరేష్. ఇప్పుడు కూడా కామెడీ రాసేవాళ్లు ఉన్నప్పటికీ.. ఒకప్పుడు కామెడీ కోసమే ప్రత్యేకంగా బోలెడంతమంది రచయితలు ఉండేవారని.. వారికి తన తండ్రి లాంటి దర్శకులు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారని నరేష్ అన్నాడు. కామెడీ ఇమేజే కొనసాగడం, ఆ జోనర్లో చేసిన సినిమా ఫెయిలవడంతో మధ్యలో ఇబ్బంది పడ్డానని.. అలాంటి టైంలో ‘నాంది’ లాంటి సీరియస్ కథతో సినిమా చేసి మెప్పించడం, అది విజయం సాధించడం తన కెరీర్‌కు గొప్ప రిలీఫ్ అని నరేష్ అన్నాడు. ప్రస్తుతం తాను ‘మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రంలో నటిస్తున్నట్లు నరేష్ వెల్లడించాడు.