జూనియర్ సినిమాలో సోనాలీ రీ ఎంట్రీ

ఆ మధ్య క్యాన్సర్ బారిన పడి పోరాడి గెలిచిన సోనాలి బెంద్రేకు తెలుగు ప్రేక్షకులకు మంచి బాండింగ్ ఉంది. టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎప్పటికీ మర్చిపోలేని బ్లాక్ బస్టర్స్ లో భాగమవ్వడం ఎవరూ మర్చిపోలేరు. ముఖ్యంగా మురారిలో మహేష్ బాబు మరదలిగా ఇచ్చిన పెర్ఫార్మన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. శంకర్ దాదా ఎంబిబిఎస్ లో డాక్టర్ సునీతగా చిరంజీవి అల్లరిని భరిస్తూ చేసిన సెటిల్డ్ యాక్టింగ్ ని అభిమానులు ఏళ్ళ తరబడి గుర్తుంచుకున్నారు. అందం అభినయం రెండూ ఉన్న నటి.

నాగార్జున మన్మథుడు, ఖడ్గం, ఇంద్ర మూడూ దేనికవే సాటి అనిపించే గొప్ప క్యారెక్టర్స్. బాలయ్యతో చేసిన పలనాటి బ్రహ్మనాయుడు ఒక్కటే సోనాలికి చేదు ఫలితం ఇచ్చింది. మొత్తంగా ఇంత సక్సెస్ పర్సెంటేజ్ ఏ హీరోయిన్ కీ అప్పట్లో లేదన్న మాట వాస్తవం. 2003లో చిరుతో నటించాక బ్రేక్ తీసుకున్న సోనాలి బెంద్రే మళ్ళీ తెరపై కనిపించలేదు. ఆ తర్వాత ఓ రెండు హిందీ క్యామియోలు చేశాక గోల్డీ బెహ్ల్ ని పెళ్లి చేసుకుని నటనకు స్వస్తి చెప్పేసింది. తిరిగి తన జబ్బు గురించి చెప్పాల్సి మాత్రమే బయటికి వచ్చింది.

ఇప్పుడు తను పూర్తిగా కోలుకోవడంతో పాటు కెరీర్ ని తిరిగి స్టార్ట్ చేయాలనుకుంటోందని సమాచారం. అందులో భాగంగానే కొరటాల శివ – జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీలో ఓ కీలకమైన పాత్ర కోసం తనను సంప్రదిస్తే పాజిటివ్ గా స్పందించారని తెలిసింది. పూర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక అఫీషియల్ గా ప్రకటిస్తారు. ఒకవేళ నిజమైతే 19 ఏళ్ళ తర్వాత సోనాలి బెంద్రే రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇదే అవుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ కి తుదిమెరుగులు దిద్దే పనిలో కొరటాల ఉన్నారు.