ఒకటి ఓకే.. రెండు వీకెండ్లోనే వాషౌట్


మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఆచార్య’కు.. సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ ‘సర్కారు వారి పాట’కు మధ్యలో దొరికిన ఖాళీలో మూడు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో ప్రేక్షకుల దృష్టిని అంతో ఇంతో ఆకర్షించిన సినిమా అంటే.. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే చెప్పాలి. మిగతా రెండు చిత్రాలు భళా తందనాన, జయమ్మ పంచాయితీ గురించి ఆడియన్స్‌లో పెద్ద చర్చే లేదు. రిలీజ్ తర్వాత టాక్, బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ కూడా ఇందుకు అనుగుణంగానే ఉన్నాయి.

విశ్వక్సేన్ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అది యూత్, ఫ్యామిలీస్ ఇష్టపడే అంశాలున్న సినిమా కావడంతో సినిమాకు ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజు మార్నింగ్, మ్యట్నీ షోలతో పోలిస్తే తర్వాతి రెండు షోలకు ఆక్యుపెన్సీ పెరిగింది. శనివారం ఈ చిత్రానికి డీసెంట్ ఆక్యుపెన్సీ కనిపించింది. దాని స్థాయిలో సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ప్రభావమే చూపిస్తోంది. ఓవర్సీస్‌లో లిమిటెడ్ రిలీజ్‌తోనే మంచి వసూళ్లు రాబడుతోంది ఈ చిత్రం.

ఆదివారం వసూళ్లు కూడా బాగుండడంతో ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులు మెరుగ్గానే కనిపిస్తున్నాయి. ఓ మోస్తరుగా లాభాలు కూడా రావచ్చు. ఐతే ఈ సినిమాతో పోలిస్తే హాలీవుడ్ మూవీ ‘డాక్టర్ స్ట్రేంజ్’కే ఎక్కువ వసూళ్లు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ వీకెండ్ విన్నర్ ఆ చిత్రమే. గత వారం వచ్చిన ‘ఆచార్య’ రెండో వీకెండ్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.

తెలుగు సినిమాల వరకు విశ్వక్ సినిమానే విజేత. శ్రీ విష్ణు తన ఇమేజ్‌కు భిన్నంగా చేసిన ‘భళా తందనాన’కు డీసెండ్ రిలీజ్ దక్కినా ఆ చిత్రానికి బిలో యావరేజ్ టాక్ రావడంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోతోంది. ఇక సుమ సినిమా ‘జయమ్మ పంచాయితీ’ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతోంది. రిలీజ్ చేసిందే చాలా తక్కువ థియేటర్లలో కాగా.. ఆ షోలను నడిపించడం కూడా కష్టమయ్యే పరిస్థితి. ఆక్యుపెన్సీ లేక వీకెండ్లోనే ‘భళా తందనాన’, ‘జయమ్మ పంచాయితీ’లకు షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కొన్ని చోట్ల. వీకెండ్ తర్వాత ఈ సినిమాలు థియేటర్లలో నిలవడం కష్టమే.