బాహుబలి బాలీవుడ్ లో చరిత్ర సృష్టించాక దాన్ని మించిన విజువల్ గ్రాండియర్ ఒకటి తామూ తీయాలన్న తపనలో బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఎప్పటి నుంచో ఉన్నారు. కొన్ని ప్రయత్నాలు చేశారు కానీ అవన్నీ నిరాశ కలిగించే ఫలితాలనే ఇచ్చాయి. కానీ మల్టీ స్టారర్ గా వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న బ్రహ్మాస్త్ర మీదున్న బజ్ వేరు. నిర్మాత కరణ్ జోహార్ కాన్ఫిడెన్స్ ఇంకో లెవెల్ లో కనిపిస్తోంది. ఏకంగా మూడు భాగాలు సిద్ధం చేస్తున్నారంటే ప్రోడక్ట్ మీద నమ్మకం ఓ స్థాయిలో ఉంటేనే ఇంత రిస్క్ కు సిద్ధ పడతారు.
ఇప్పుడీ బ్రహ్మాస్త్రను నిర్మాణ భాగస్వాముల్లో ఒకరైన ఫాక్స్ స్టార్ సంస్థ తమ డిస్నీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న విడుదల చేయబోతోంది. ఈ ఏడాదిలో డిస్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమాలు అవతార్ 2 ది వే అఫ్ వాటర్, బ్లాక్ పాంథర్ వాకండ ఫరెవర్, థోర్ లవ్ అండ్ థండర్. వీటి సరసన బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివని రిలీజ్ చేస్తారు. అంటే బాహుబలి, దంగల్, ఆర్ఆర్ఆర్, 2.0లను ఈజీగా ఓవర్ టేక్ చేసే స్థాయిలో థియేట్రికల్ ఎంట్రీ ఉంటుందన్న మాట. వివిధ భాషల్లో డబ్బింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ డ్రామాలో ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటైన రన్బీర్ కపూర్ అలియా భట్ లు హీరో హీరోయిన్లు. నాగార్జున ఒక స్పెషల్ క్యామియో చేశారు. అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలు ఈ క్యాస్టింగ్ లో భాగమయ్యారు. షారుఖ్ ఖాన్ గెస్ట్ అప్పియరెన్స్ ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ మెయిన్ అట్రాక్షన్ గా రూపొందుతున్న బ్రహ్మాస్త్ర తెలుగు వెర్షన్ కు రాజమౌళి సమర్పకులు. అంచనాలైతే అంతకంతా పెరుగుతున్నాయి. వాటిని నిలబెట్టుకుంటే చాలు కలెక్షన్ల జాతరే.