‘పోకిరి’ సెంటిమెంటు వెంటాడుతోందా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కొత్త సినిమా స‌ర్కారు వారి పాట ఇంకో ఐదు రోజుల్లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు. మ‌హేష్ పోకిరి రేంజ్ హిట్ కొడ‌తాడ‌ని.. అదే స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను ఈ సినిమా అల‌రిస్తుంద‌ని చాలామంది అంటున్నారు. ఎందుకో కానీ అభిమానులు ముందు నుంచి ఈ సినిమాకు, పోకిరికి లింక్ పెడుతూనే ఉన్నారు.

పూరి జ‌గ‌న్నాథ్ శిష్యుడైన ప‌ర‌శురామ్ ఈ సినిమాను రూపొందించ‌డం, ఇది ఫుల్ లెంగ్త్ మాస్ ఎంట‌ర్టైన‌ర్ లాగా క‌నిపిస్తుండ‌ట‌మే అందుకు కార‌ణం కావ‌చ్చు. కాగా మ‌హేష్ బాబు కూడా ఈ సినిమాను పోకిరితో పోల్చుకుంటున్నాడేమో అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి. ఇందుకు కార‌ణం లేక‌పోలేదు. తాజాగా మ‌హేష్ బాబు అభిమానుల‌ను ఉద్దేశించి ఒక లేఖ రాశాడు. స‌ర్కారు వారి పాట సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంద‌ని, అంద‌రూ థియేట‌ర్ల‌లోనే సినిమా చూసి ఆనందించాల‌ని పేర్కొంటూ.. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న త‌న త‌ర్వాతి సినిమా షూట్ గురించి అప్‌డేట్ ఇచ్చాడు.

కాగా 2006లో పోకిరి విడుద‌ల‌కు ముందు కూడా మ‌హేష్ ఇలాగే అభిమానుల‌కు లేఖ రాయ‌డం విశేషం. పోకిరి టైటిల్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింద‌ని, ఆడియో హిట్ట‌యింద‌ని, అలాగే ఈ సినిమా చూసి త‌మ అభిప్రాయాలు చెప్పాల‌ని అభిమానుల‌ను ఉద్దేశించి అప్పుడు పేర్కొన్నాడు మ‌హేష్‌. అంతే కాక త‌న త‌ర్వాతి చిత్రం సైనికుడు షూటింగ్ అప్‌డేట్ కూడా అందులో ఇచ్చాడు. ఆ లేఖ‌, ఇప్పుడు స‌ర్కారు వారి పాట విడుద‌ల‌కు ముందు రాసిన లేఖలో పోలిక‌లు క‌నిపిస్తుండ‌టంతో.. పోకిరి సెంటిమెంటుతోనే మ‌హేష్ ఈ లెట‌ర్ రాసి ఉండొచ్చ‌ని, కాబట్టి పోకిరి మాదిరే స‌ర్కారు వారి పాట బ్లాక్‌బ‌స్ట‌ర్ అయి మ‌హేష్‌కు, అభిమానుల‌కు అమితానందాన్ని క‌లిగిస్తుంద‌ని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు పోస్టులు పెడుతున్నారు. ‘సర్కారు వారి పాట’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతున్నపుడు కూడా మహేష్ ‘పోకిరి’తో ఈ సినిమాకు పోలిక పెట్టడంతో ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు.