వారం కిందట బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడటం ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఇప్పటికీ ఆ విషాదాంతం చర్చనీయాంశంగానే ఉంది. అతడి బలవన్మరణానికి బాలీవుడ్ మూవీ మాఫియానే కారణమని.. వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లంతా కలిసి గ్రూపులు కట్టారని.. సొంత ప్రతిభతో ఎదిగిన సుశాంత్‌ను తొక్కే ప్రయత్నం చేశారని.. ఈ నేపథ్యంలోనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతడి మద్దతుదారులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ రంగంలో నెపోటిజం మీద పెద్ద చర్చే నడుస్తోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెలబ్రెటీలు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ చర్చలోకి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా వచ్చింది. పవన్ వారసుడు అకీరా నందన్ కూడా త్వరలోనే సినిమాల్లోకి వచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఆమె ఈ అంశంపై ఆచితూచి మాట్లాడారు.
నెపోటిజం అన్ని రంగాల్లోనూ ఉంటుందని, టాలెంట్ ఉండి ధైర్యంగా నిలబడగలిగితే దాన్ని జయించవచ్చని రేణు అభిప్రాయపడింది. ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి అని అర్థమవుతోందని ఆమె అంది. సుశాంత్‌కు ప్రతిభ ఉంది కాబట్టే సినిమాల్లో విజయం సాధించాడని, మంచి స్థాయిని అందుకున్నాడని.. అయితే భావోద్వేగాలను సమతుల్యం చేసుకోలేకపోయినట్లు కనిపిస్తోందని.. అందుకే డిప్రెషన్‌కు లోనై అంతటి తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటాడని రేణు దేశాయ్ అభిప్రాయపడింది. సినిమాల్లోకి వచ్చే ఎవరైనా సరే.. కేవలం కుటుంబ నేపథ్యాన్ని నమ్ముకుని ఈ రంగంలోకి రావొద్దని, ఆర్టిస్టులకు మనో ధైర్యం కూడా ఎంతో అవసరమని ఆమె చెప్పింది. సినిమా రంగంలో రాణించాలంటే అన్నింటికంటే మానసిక ధైర్యం ఎక్కువ అవసరమని ఈ ఉదంతం గుర్తు చేస్తోందని రేణు పేర్కొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates