బిగ్ బాస్ షోకు షాక్ తప్పదా?

రియాలిటీ షో పేరుతో టీవీల్లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ లాంటి షోలకు తొందరలోనే షాక్ తప్పేట్లు లేదు.  కొద్ది సంవత్సరాలుగా మనదేశంలో బిగ్ బాస్ పేరుతో ఒక రియాలిటీ షో నడుస్తోంది. దీన్ని టీవీలు ప్రసారం చేస్తున్నాయి. అయితే ఈ షోలపై సమాజంలో పెద్దగా సానుకలత లేదు. ఎందుకంటే హద్దులు దాటిన ప్రవర్తనను యధాతథంగా చూపిస్తున్నారు. పార్టిసిపెంట్స్ చేసే గోల, వాళ్ళ గొడవలు, తిట్లు, ముద్దులు పెట్టుకోవటం, వాటేసుకోవడం లాంటివి కొన్నిసార్లు హద్దులు దాటిపోతున్నాయి.

అందుకనే బిగ్ బాస్ షోను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యభిచార గృహమని ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. సరే నారాయణ లాగా బహిరంగంగా వ్యాఖ్యలు చేయని వారు కూడా ఈ షో విషయంలో సానుకూలంగా అయితే లేరు. అందుకనే మెల్లిమెల్లిగా ఈ షోకు దేశంలో జనాదరణ తగ్గిపోతోంది. ఇలాంటి నేపధ్యంలోనే షోకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసు దాఖలైంది. ఈ విచారణలో భాగంగా హైకోర్టు బిగ్ బాస్ లాంటి షోల్లో హింస, అశ్లీలత తప్ప ఇంకేముందని వ్యాఖ్యానించింది.

రియాలిటీ షోల పేరుతో ఏది పడితే అది చూపిస్తామంటే న్యాయస్ధానాలు చూస్తూ ఊరుకోవని గట్టిగా హెచ్చరించింది. కేసు విచారణను వాయిదా వేసినా చేసిన వ్యాఖ్యలను బట్టి ఇలాంటి రియాలిటీ షోల పై కోర్టుకు కూడా సదభిప్రాయం లేదని అర్ధమైపోతోంది. 

పాశ్చాత్య దేశాల్లో లాగ బిగ్ బాస్ షో విచ్చలవిడిగా లేకపోయినా దాదాపు అదే దారిలో వెళుతోంది. పైగా పార్టిసిపెంట్ ఎలిమినేషన్ పై అనేక ఆరోపణలున్నాయి. అవసరమైన వాళ్ళని కంటిన్యూ చేస్తూ అనవసరం అనుకున్న వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారనే గోల కూడా జరుగుతోంది. పేరుకు మాత్రమే వ్యూవర్స్ ఓటు కానీ జరిగేదంతా మేనేజ్మెంట్ జిమ్మిక్కులేననే ఆరోపణలకు అంతేలేదు. 

ఏదేమైనా బిగ్ బాస్ నిర్వహణపై పూర్తిస్ధాయి విచారణ జరిగిన తర్వాత కార్యక్రమాల రూపకల్పన, ప్రసారాలపై స్పష్టమైన విధివిధానాలు వచ్చే అవకాశాలున్నాయి. కోర్టు చెప్పినట్లుగా నడుచుకోవాలంటే నిర్వాహకులు నెత్తిన గుడ్డేసుకోవాల్సిందే. కాబట్టి ఎలాచూసినా తొందరలోనే బిగ్ బాస్ కార్యక్రమం మన దగ్గర ఆగి పోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.