గోల్డెన్ లెగ్ నుంచి.. మళ్ళీ ఐరెన్ లెగ్

తమిళంలో ముగమూడి (మాస్క్).. తెలుగులో ఒక లైలా కోసం, ముకుంద.. హిందీలో మొహెంజదారో.. కెరీర్ ఆరంభంలో ఇలా ప్రతి భాషలోనూ ఫెయిల్యూర్లు ఎదుర్కొని ‘ఐరెన్ లెగ్’ ముద్ర వేసుకుంది పూజా హెగ్డే. కట్ చేస్తే కొన్నేళ్ల తర్వాత సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. ‘దువ్వాడ జగన్నాథం’తో మంచి పాపులారిటీ సంపాదించిన ఆమె.. అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురుములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ లాంటి వరుస విజయాలతో తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.

హ్యాట్రిక్ డిజాస్టర్లు ఇచ్చిన అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లాంటి యావరేజ్ మూవీతోనూ హిట్టు కొట్టడంతో ఆమెకు ‘గోల్డెన్ లెగ్’ ట్యాగ్ ఇచ్చేశారు. ఆమె పట్టిందల్లా బంగారం అవుతోందనే కామెంట్లు వినిపించాయి. కొత్త ఏడాదిలో ‘రాధేశ్యామ్’, ‘బీస్ట్’, ‘ఆచార్య’ లాంటి భారీ చిత్రాల రిలీజ్ ఉండడంతో పూజా కెరీర్ మరో స్థాయికి వెళ్లిపోతుందని అంచనా వేశారు. ఐతే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూడు చిత్రాలూ నిరాశకు గురి చేశాయి.

‘రాధేశ్యామ్’ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాగా నిలిచింది. ‘బీస్ట్’ కూడా బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో మరీ నామమాత్రమైన పాత్ర చేయడంతో పూజా ట్రోల్స్‌కు కూడా గురైంది. ఇప్పుడు ‘ఆచార్య’లో రామ్ చరణ్‌కు జోడీగా చేసిన నీలాంబరి పాత్ర కూడా నిరాశకే గురి చేసింది. ఇది కూడా ఉత్సవ విగ్రహం లాంటి పాత్రే. ఆమె ఎపిసోడ్ ప్రేక్షకులకు బాగా బోర్ కొట్టిస్తోంది. వరుసగా రెండు డిజాస్టర్ల నేపథ్యంలో ‘ఆచార్య’ మీద చాలా ఆశలు పెట్టుకుని తన వంతుగా గట్టిగా ప్రమోట్ చేసిందీ చిత్రాన్ని పూజా.

కానీ ఫలితం లేకపోయింది. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం వీకెండ్ తర్వాత నిలబడడం కష్టమే అనిపిస్తోంది. పూజా వల్ల సినిమాకు కానీ, సినిమా వల్ల పూజాకు కానీ ఎలాంటి ప్రయోజనం లేదనే చెప్పాలి. 50 రోజుల వ్యవధిలో మూడు ఫెయిల్యూర్లు ఖాతాలో వేసుకోవడంతో ఇంతకుముందు గోల్డెన్ లెగ్ అన్న నోళ్లతోనే ఇప్పుడు ఆమెను తిరిగి ఐరెన్ లెగ్ అనేస్తున్నారు నెటిజన్లు. ఇక పూజా ఆశలన్నీ మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా మీదే.