ఒక దర్శకుడు.. పది మంది హీరోయిన్లు

‘అ!’ అనే వైవిధ్యమైన చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమా చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగులో అలాంటి కథాకథనాలతో సినిమా రావడం అరుదు. ఈ చిత్రం సగటు ప్రేక్షకులకు అర్థం కాకపోవడం, వారికి రుచించకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్నందుకోలేదు కానీ.. ప్రశాంత్ ప్రయత్నానికి విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు కూడా దక్కాయి. ఆ సినిమాకు స్క్రీన్ ప్లే విషయంలో కొత్త టెక్నిక్‌ను అనుసరించిన ప్రశాంత్.. తర్వాతి రెండు చిత్రాలను మామూలు స్టయిల్లోనే లాగించేశాడు.

కల్కి, జాంబి రెడ్డి మామూలు సినిమాల్లాగే ఉంటాయి. ఇప్పుడతను ‘హనుమాన్’ అనే సూపర్ హీరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘జాంబిరెడ్డి’తో హీరోగా పరిచయం అయిన ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంతో మరోసారి ప్రశాంత్ ప్రయోగమే చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీని తర్వాత ప్రశాంత్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. అతను పది మంది హీరోయిన్లలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట.

‘అ!’ తరహాలోనే ఇది కూడా ఒక విభిన్నమైన సినిమా అని అంటున్నారు. ఒక పాత్రకు ఇంకో పాత్రకు ముడిపెడుతూ.. చివర్లో అన్ని పాత్రలకు ఒక లింక్ పెట్టి స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయడానికి ప్రశాంత్ ప్రయత్నిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. బహుశా ఇది కూడా ‘అ!’ తరహా చిత్రమే అయ్యుండొచ్చు. అందులో కూడా ఇలాగే చాలా క్యారెక్టర్లుంటాయి. వాటి కథలను సమాంతరంగా చూపిస్తూ వెళ్తాడు. చివర్లో వాటికున్న లింక్ ఏంటన్నది వెల్లడవుతుంది. నిజానికి ‘అ!’ చిత్రానికి సీక్వెల్ తీయాలని ప్రశాంత్ ఎంతో ఆశపడ్డాడు.

దానికి స్క్రిప్టు కూడా అయినట్లు వెల్లడించాడు. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని కీలకపాత్రకు అడిగినట్లు కూడా గతంలో ప్రశాంత్ తెలిపాడు. మరి ఆ ప్రాజెక్టు ఎందుకు కార్యరూపం దాల్చలేదో తెలియదు. ఇప్పుడేమో పది మంది హీరోయిన్లతో సినిమా అంటూ వార్తలొస్తున్నాయి. మరి ఈ వినూత్న ప్రయోగం ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో.. అదెలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.