పూజా హెగ్డే ఇప్పుడు తెలుగులో నంబర్ వన్ హీరోయిన్ అనడంలో సందేహం లేదు. కెరీర్ ఆరంభంలో ఒక లైలా కోసం, ముకుంద చిత్రాలు నిరాశ పరిచినా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో పెద్ద పెద్ద సినిమాల్లో నటించి చెప్పుకోదగ్గ స్థాయిలోనే బ్లాక్‌బస్టర్లు అందుకుంది. కానీ టాలీవుడ్ అవతల మాత్రం ఆమెకు సరైన సక్సెస్‌లు లేవు.
హిందీలో చేసిన మొహెంజదారో, హౌస్ ఫుల్4 డిజాస్టర్లయ్యాయి. తమిళంలో కెరీర్ ఆరంభంలోనే ‘మాస్క్’ అనే సినిమా చేసిందామె. అప్పటికి తెలుగులో కూడా నటించలేదు. జీవా హీరోగా నటించిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. పూజాను ఎవరూ గుర్తించనే లేదు అప్పుడు.
ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడా ఫ్లాపులే ఎదురయ్యాయి. ఆపై ‘మొహెంజదారో’తో బాలీవుడ్లో అడుగు పెట్టింది. అక్కడ డిజాస్టర్ తప్పలేదు. తిరిగి ‘దువ్వాడ జగన్నాథం’తో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తే ఆ సినిమా ఓ మోస్తరుగానే ఆడినా.. పూజాకు మాత్రం మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.
అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో లాంటి ఘనవిజయాలతో పూజా టాప్ రేంజికి వెళ్లిపోయింది. గత నెలలో ‘రాధేశ్యామ్’తో చేదు అనుభవం ఎదుర్కొన్నప్పటికీ.. ఆచార్య, త్రివిక్రమ్-మహేష్ బాబు సినిమా లాంటి క్రేజీ ప్రాజెక్టులు ఆమె నుంచి రాబోతున్నాయి. తెలుగులో అయితే ఆమెకు ఢోకా లేనట్లే ఉంది. ఐతే వేరే భాషల్లో మాత్రం ఆమె రాత మారట్లేదు.
తమిళంలో ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత విజయ్ లాంటి సూపర్ స్టార్‌తో ‘బీస్ట్’ అనే భారీ చిత్రం చేస్తే.. అది ఆమెకు చేదు అనుభవం మిగిల్చింది. ఈ సినిమా ట్రైలర్ చూసినపుడే పూజాకు ఇందులో ఏమాత్రం రోల్ ఉందో అని సందేహించారు. అప్పుడు ఆమెను తక్కువ చేస్తూ ట్రోల్స్ కూడా పడ్డాయి. ఇప్పుడిక సినిమా చూశాక ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
రెండు పాటల్లో మెరవడం తప్పితే.. పూజాకు ఇందులో ఏమాత్రం ప్రాధాన్యం లేదు. సైడ్ క్యారెక్టర్ లాగా తయారైందామె. ఇలాంటి సినిమా గురించా పూజా ఇంత హంగామా చేసింది అంటూ ఆమె మీద కౌంటర్లు వేస్తున్నారు. సినిమాకు కూడా నెగెటివ్ టాక్ రావడం పూజాకు నిరాశ కలిగించే విషయం. ఇంత భారీ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చినా మళ్లీ ఆమెకు కోలీవుడ్లో తిరస్కారం తప్పలేదు.