మాస్ రాజా రొమాన్స్.. సెట్టవ్వలా

ఇమేజ్ అనేది హీరోలకు కొన్నిసార్లు పెద్ద అడ్డంగా మారుతుంటుంది. మాస్, యాక్షన్ సినిమాలతో మంచి విజయాలందుకుని, ఎక్కువగా అలాంటి సినిమాలతోనే అలరించిన హీరోలు క్లాస్ టచ్ ఉన్న సినిమాలు చేస్తే కథ అడ్డం తిరుగుతుంటుంది. అలాగే ఎక్కువగా క్లాస్ సినిమాలు చేసే హీరోలు మాస్, యాక్షన్ అంటే తేడా కొట్టేస్తుంటుంది. ఇందులో మొదటి దానికి రవితేజ ఉదాహరణ అయితే.. రెండోదానికి నాగచైతన్య ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. తమ ఇమేజ్‌కు భిన్నంగా వాళ్లు సినిమాలు చేసిన ప్రతిసారీ ఎదురు దెబ్బలే తగిలాయి.

రవితేజ నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో, సారొచ్చారు లాంటి సినిమాలతో ఎలా బోల్తా కొట్టాడో తెలిసిందే. డిస్కో రాజా అంటూ మరో వైవిధ్యమైన ప్రయత్నం చేసినా ఇదే ఫలితం ఎదురైంది. దీంతో మళ్లీ క్రాక్, ఖిలాడి అంటూ మాస్ మసాలా సినిమాల వైపే మొగ్గాడు. ఐతే త్వరలో రాబోతున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ మాస్, క్లాస్ కలబోతలాగా కనిపిస్తోంది.

ఇటీవల రిలీజైన టీజర్ చూస్తే మాస్ అంశాలకు లోటు లేనట్లే కనిపించింది. ఐతే తాజాగా ఈ సినిమా నుంచి బుల్ బుల్ తరంగ్ అంటూ ఒక పాట రిలీజ్ చేశారు. ఈ పాటను ఆలపించింది సిద్ శ్రీరామ్ కాగా.. తమన్ సంగీత దర్శకుడు. వినడానికి ఈ పాట చాలా బాగుంది. సిద్ వాయిస్ పెద్ద అట్రాక్షన్ అనడంలో సందేహం లేదు.

పాట ఆద్యంతం మెలోడియస్‌గా సాగి సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. కానీ విజువల్స్ చూస్తే మాత్రం అస్సలు అతకనట్లు అనిపించాయి. అందుక్కారణం.. రవితేజ ఇమేజే. మాస్ రాజా పాటలంటే మంచి బీట్‌గా సాగాలి. మాస్‌గా అనిపించాలి. లవ్ సాంగ్ అయినా సరే.. అల్లరల్లరిగా ఉండాలి. అలా కాకుండా ఆయన లవర్ బాయ్ లాగా మారి హీరోయిన్ వెనుక ప్రేమగీతం పాడుతూ క్లాస్ స్టెప్ప్ వేస్తుంటే చూడ్డానికి ఏదోలా అనిపిస్తోంది ప్రేక్షకులకు. అందులోనూ మాస్ రాజా పక్కన మలయాళ భామ రజిషా విజయన్ మరీ చిన్న పిల్లలాగా అనిపిస్తోంది. ఇద్దరికీ జోడీ కుదరనట్లు అనిపిస్తోంది. రొమాన్స్ పండలేదు. కెమిస్ట్రీ అసలే వర్కవుట్ కాలేదు. దీంతో పాట ఎంత బాగున్నా విజువల్‌గా మాత్రం తేడా కొట్టేసినట్లే అనిపిస్తోంది.