చ‌ర‌ణ్‌తో ప్ర‌శాంత్ నీల్.. లేదా?

కేజీఎఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ ఫిలిం ఇండ‌స్ట్రీలో హాట్ షాట్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డైపోయాడు ప్ర‌శాంత్ నీల్. క‌ర్ణాట‌క అవ‌త‌ల ఎవ‌రికీ ప‌రిచ‌యం లేని య‌శ్ అనే హీరోను పెట్టి దేశ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌కు గూస్ బంప్స్ ఇచ్చి అన్ని చోట్లా కేజీఎఫ్ సినిమాను బ్లాక్‌బ‌స్ట‌ర్ చేసిన ద‌ర్శ‌కుడ‌త‌ను. అలాంటి ద‌ర్శ‌కుడితో మ‌న సూప‌ర్ స్టార్లు సినిమాలు చేస్తే ఎలా ఉంటుందా అన్న ఊహ కేజీఎఫ్ చూడ‌గానే తెలుగు ప్రేక్ష‌కులు చాలామందికి క‌లిగింది. ఈ ఆశ‌ల మ‌న హీరోలు, నిర్మాత‌ల్లోనూ పుట్టి చ‌క‌చ‌కా ప్రాజెక్టులు సెట్ అయిపోయాయి.

కేజీఎఫ్‌-2 రిలీజ్ కాక‌ముందే ప్ర‌భాస్ లాంటి సూప‌ర్ స్టార్‌తో స‌లార్ సినిమాను మొద‌లుపెట్టేశాడు ప్ర‌శాంత్. దీంతో పాటే జూనియ‌ర్ ఎన్టీఆర్‌తోనూ ఓ సినిమా ఓకే అయింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో ఈ సినిమాను చాన్నాళ్ల ముందే అనౌన్స్ చేశారు.

కాగా ప్రశాంత్.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తోనూ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు కొన్ని నెల‌ల కింద‌ట జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. మీడియాలో అన్ని చోట్లా ఈ మేర‌కు వార్త‌లు కూడా వ‌చ్చేశాయి. అందుక్కార‌ణం.. ప్ర‌శాంత్ ఆ మ‌ధ్య చిరంజీవి, చ‌ర‌ణ్‌ల‌ను వారి ఇంట్లో వ్య‌క్తిగ‌తంగా క‌లుసుకోవ‌డం, ఈ క‌ల‌యిక గురించి చాలా ఎగ్జైట్ అవుతూ సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు పెట్ట‌డం. చ‌ర‌ణ్, ప్ర‌శాంత్ త‌మ చేతుల్లో ఉన్న ప్రాజెక్టుల‌న్నీ పూర్తి చేశాక క‌లిసి సినిమా చేస్తార‌ని భావించారు.

ఐతే ఇప్పుడు ఈ ప్ర‌చారానికి ప్ర‌శాంత్ తెర‌దించేశాడు. ప్ర‌స్తుతానికి తాను క‌మిటైన సినిమాలు స‌లార్, తార‌క్‌తో చేయ‌బోయే చిత్రం మాత్ర‌మేన‌ని ఓ ఇంట‌ర్వ్యూలో స్ప‌ష్టం చేశాడు. ఆ త‌ర్వాత తాను త‌న తొలి చిత్రం ఉగ్రం క‌థానాయ‌కుడు ముర‌ళీతో ఓ సినిమా చేస్తాన‌ని.. ఆపై య‌శ్‌తో ఇంకో సినిమా చేస్తాన‌ని తెలిపాడు. ఇవి కాక ఏ సినిమా ఒప్పుకోలేద‌న్నాడు. ఇక కేజీఎఫ్ త‌ర్వాత‌ వరుస‌గా తెలుగు హీరోల‌తో సినిమాలు చేస్తుండ‌టం గురించి అడిగితే.. తన‌కు తానుగా ఏ తెలుగు హీరోనూ సంప్ర‌దించ‌లేద‌ని, వాళ్లే త‌న‌తో సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించారని ప్ర‌శాంత్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.