ఆర్ఆర్ఆర్.. ఏందయ్యా ఈ నంబర్లు

‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ముంగిట ఈ సినిమా విజయంపై చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు. బాహుబలి-2 కలెక్షన్లను మించితే తప్ప బ్రేక్ ఈవెన్ కాలేని పరిస్థితుల్లో ఇది నిజంగా బాక్సాఫీస్ సక్సెస్ అవుతుందా లేదా అన్న డౌట్లు కొట్టాయి చాలామందిలో. ‘బాహుబలి’ తరహాలో మ్యాజిక్ చేయడం రాజమౌళికి కూడా సాధ్యం కాదని, టాక్ అటు ఇటు అయితే అంతే సంగతులు అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

కానీ నిజానికి ఈ సినిమాకు మరీ గొప్ప టాక్ ఏమీ రాలేదు. ‘బాహుబలి’లా అందరూ ఈ సినిమాను మెచ్చలేదు. నెగెటివ్ కామెంట్లు బాగానే వినిపించాయి. అయినా సరే.. ఈ సినిమా అన్నింటినీ అధిగమించి బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. మిగతా చోట్ల అంతటా కూడా ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్ ఫిగర్స్ చూసి ట్రేడ్ పండిట్లకు కూడా మతులు పోతున్నాయి. రెండో వీకెండ్ పూర్తయ్యేసరికి ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ వైడ్ రూ.900 కోట్ల గ్రాస్ మార్కుకు చేరువగా ఉండటం అసాధారణమైన విషయం.

ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమా రూ.100 కోట్ల షేర్ మార్కుకు చేరువగా ఉంది. పది రోజులకు గాను ఈ చిత్రం ఇక్కడ రూ.97 కోట్ల షేర్ సాధించింది. ఈ చిత్రాన్ని తెలంగాణలో రిలీజ్ చేసిన దిల్ రాజు రూ.75 కోట్లకు హక్కులు కొన్నారు. ఆయన ఆల్రెడీ రూ.20 కోట్లకు పైగా లాభాన్ని జేబులో వేసుకున్నారు. ఫుల్ రన్లో ఈ చిత్రం నైజాం వరకే రూ.110 కోట్ల షేర్ సాధిస్తుందన్న అంచనాలున్నాయి. పెద్ద సినిమాలకు ఓవరాల్‌గా రూ.100 కోట్ల షేర్ పెద్ద సవాలుగా మారిన పరిస్థితుల్లో ఒక్క తెలంగాణ వరకే ఈ చిత్రం రూ.110 కోట్ల షేర్ సాధిస్తోందంటే దీని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇక సీడెడ్లో ఇప్పటిదాకా ఏ చిత్రం కూడా రూ.35 కోట్ల షేర్ మార్కునే అందుకోలేదు. అలాంటిది ‘ఆర్ఆర్ఆర్’ ఆల్రెడీ రూ.40 కోట్ల షేర్ మార్కును దాటేసింది. ఫుల్ రన్లో రూ.45 కోట్ల బెంచ్ మార్క్ సెట్ చేసేలా కనిపిస్తోంది. ఇక ఆంధ్రాలో ఈ చిత్రం రూ.92 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అక్కడ కూడా రూ.100 కోట్ల షేర్ మార్కును దాటడం గ్యారెంటీ. తెలంగాణలో మాదిరి రేట్లుంటే ఆంధ్రా, రాయలసీమల్లో నంబర్లు ఇంకో రేంజిలో ఉండేవి. ఆల్రెడీ ఈ చిత్రం ఏపీ, తెలంగాణల్లో రూ.200 కోట్ల షేర్ మార్కును దాటేసింది. రూ.250 కోట్ల షేర్‌తో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇండియాలో ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్ రూ.200 కోట్ట నెట్ వసూళ్ల దిశగా పరుగులు పెడుతుండగా.. యుఎస్‌లో ఈ చిత్రం 12 మిలియన్ డాలర్ల మార్కును టచ్ చేసింది.