తన కజిన్ వరుణ్ తేజ్ అంటే తనకు చిన్నతనం నుంచే చాలా ఇష్టమని అల్లు అర్జున్ అన్నాడు. వరుణ్ కొత్త సినిమా గని ప్రి రిలీజ్ ఈవెంట్లో బన్నీ మాట్లాడుతూ.. వరుణ్ ఇప్పుడు అందరికీ అందగాడిగా కనిపిస్తుండొచ్చని, కానీ పుట్టినపుడే అతను చాలా క్యూట్‌గా ఉండేవాడని, అప్పట్నుంచే అతను అందగాడని బన్నీ చెప్పాడు.
సినిమాల్లోకి రాకముందు వరకు వరుణ్ అంటే తనకు ఇష్టం మాత్రమే ఉండేదని.. కానీ అతను సినిమాల్లోకి వచ్చాక తనపై గౌరవం వచ్చిందని.. అందుకు కారణం తను ఎంచుకున్న సినిమాలని, ఫలితాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేశాడని, అతడి జర్నీని చూసి తామందరం గర్వపడుతున్నామని బన్నీ అన్నాడు. గని సినిమా కోసం వరుణ్ మామూలు కష్టం పడలేదని.. కరోనా కారణంగా సినిమాఆలస్యమైనా.. సిక్స్ ప్యాక్ కొనసాగిస్తూ, బాక్సింగ్ చేస్తూ ఇంత కాలం కష్టపడటం మామూలు విషయం కాదని బన్నీ అన్నాడు.
తాను గని సినిమా చూశానని.. తనకు బాగా నచ్చిందని.. రేప్పొద్దున ప్రేక్షకులు కూడా ఈ సినిమాను మెచ్చుతారని బన్నీ ధీమా వ్యక్తం చేశాడు. నిర్మాత అయిన తన తండ్రి వారసత్వాన్ని తమ్ముడు శిరీష్ కొనసాగిస్తాడని అనుకున్నానని, కానీ అతను నటనలోకి వచ్చాడని, అది తనకు ఇష్టమైన విషయమే అయినా.. తండ్రి వారసత్వాన్ని ఎవరు కొనసాగిస్తారు అనుకుంటే.. తన అన్నయ్య బాబీ నిర్మాతగా మారడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పాడు బన్నీ. నిర్మాణ వ్యవహారాల్లో బాబీకి 20 ఏళ్ల అనుభవం ఉందని.. తన సినిమాల కథల ఎంపికలో కూడా కీలకంగా ఉన్నాడని, అలాంటి వ్యక్తి ఈ సినిమాతో నిర్మాత అవుతున్నాడంటే అది చాలా స్పెషల్‌గానే ఉంటుందని బన్నీ చెప్పాడు.
దర్శకుడు కిరణ్ కొర్రపాటి తనపై అందరూ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే సినిమా తీశాడని.. ఈ మధ్య సంగీత దర్శకుడు తమన్ పట్టిందల్లా బంగారం అవుతోందని, ఈ చిత్రం కూడా హిట్టయి అతడి విన్నింగ్ స్ట్రీక్‌ను కొనసాగిస్తుందని చెప్పాడు బన్నీ. చివరగా తన అభిమానుల గురించి మాట్లాడుతూ.. మామూలుగా ఫ్యాన్స్‌కు హీరోనే బలం అని, కానీ అభిమానులే తనకు బలం అని, వాళ్లు చేసే మంచి పనులు చూసి తాను ఇన్‌స్పైర్ అయి తన ఎనర్జీ అంతా ఒక మంచి విషయానికి ఉపయోగించాలని చూస్తున్నానని బన్నీ చెప్పాడు.