హరీష్ శంకర్ టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడు. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్స్‌తో సినిమాలు చేశాడు. హరీష్ చివరి సినిమా ‘గద్దలకొండ గణేష్’ మంచి విజయమే సాధించింది. అయినా సరే.. మూడేళ్లుగా సినిమా చేయకుండా ఖాళీగా ఉన్నాడు. అలాగని అతడికి ఛాన్సుల్లేవా అంటే అదేమీ కాదు. మళ్లీ పవన్ కళ్యాణ్‌తో, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలో భారీ సినిమా చేసే అవకాశం వచ్చింది.
కానీ పవన్ కళ్యాణ్‌కు వేరే కమిట్మెంట్లు ఉండటం వల్ల ఈ సినిమా అనుకున్న సమయానికి మొదలు కాలేదు. ఇదిగో అదిగో అనుకుంటూనే ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి. దీని వల్ల హరీష్ కెరీర్లో మూడేళ్ల విరామం వచ్చేసింది. పవన్‌తో ‘భవదీయుడు భగత్ సింగ్’ను ఈ జూన్లో మొదలు పెట్టే సూచనలున్నట్లు హరీష్ సంకేతాలు ఇచ్చాడు కానీ.. పరిస్థితులు చూస్తుంటే అది సాధ్యపడేలా కనిపించడం లేదు.
కొత్తగా మరో రీమేక్ మూవీని తెరపైకి తెచ్చిన పవన్.. దానికి డేట్లు ఇచ్చాడు. మరోవైపు ‘హరిహర వీరమల్లు’ టీం ఆయన కోసం ఎదురు చూస్తోంది. దీంతో హరీష్‌కు ఇంకొంత కాలం నిరీక్షణ తప్పేలా లేదు. పవన్ సినిమా నుంచి దృష్టి మరలకూడదన్న ఉద్దేశంతో దాని స్క్రిప్టుకు మెరుగులు దిద్దుకుంటూ కూర్చున్న హరీష్.. సినిమా మరీ ఆలస్యం అవుతుండే సరికి వేరే సినిమా చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. ఐతే దాని కోసం మరీ కష్టపడాల్సిన, ఎక్కువ సమయం పెట్టాల్సిన అవసరమైతే లేదు. తన దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘దువ్వాడ జగన్నాథం’ను హిందీలో రీమేక్ చేయబోతున్నాడట హరీష్.
దిల్ రాజు నిర్మాణంలో బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా లీడ్ రోల్‌లో ఈ సినిమా తెరకెక్కనుందట. హిందీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు సమాచారం. కొన్ని నెలల్లోనే ఈ సినిమాను ముగించి.. పవన్ అందుబాటులోకి రాగానే ‘భవదీయుడు భగత్ సింగ్’ను పట్టాలెక్కించాలని హరీష్ చూస్తున్నాడు. దీంతో ‘డీజే’ రీమేక్ ఆయనకు కాలక్షేపం సినిమాగా మారుతోందని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates