ఆ హీరోయిన్ టైం.. మామూలుగా లేదు

హీరోగా ఒక స్థాయి అందుకోవాలంటే చాలా క‌ష్ట‌ప‌డాలి. టైం ప‌డుతుంది. ఎంత బ్యాగ్రౌండ్‌తో వ‌చ్చినా కూడా స్టార్ ఇమేజ్ సంపాదించ‌డం, పెద్ద అవ‌కాశాలు అందుకోవ‌డం అంత తేలికేం కాదు. కానీ హీరోయిన్ల విష‌యంలో అలా కాదు. కెరీర్ ఆరంభంలో ఒక‌ట్రెండు హిట్లు ప‌డ్డాయంటే అంతే.. రేంజ్ మారిపోతుంటుంది. హీరోల మాదిరి లాంగ్ కెరీర్ ఉన్న‌ద‌న్న మాటే కానీ.. త‌క్కువ టైంలో పెద్ద పెద్ద సినిమాలు ఎక్కువ చేసి ఫేమ్, డ‌బ్బులు సంపాదంచుకుంటుంటారు హీరోయిన్లు.

అదృష్టం క‌లిసొస్తే కెరీర్ మామూలుగా మ‌లుపు తిర‌గ‌దు కొంద‌రు హీరోయిన్ల‌కి. ఇప్పుడీ ఉపోద్ఘాత‌మంతా ఎందుకంటే.. ఉప్పెన అనే సినిమాలో హీరోయిన్‌గా ముందు ఎంపికైంది వేరే అమ్మాయి. కానీ త‌న స్థానంలోకి అనుకోకుండా కృతి శెట్టి అనే కొత్త‌మ్మాయి వ‌చ్చింది. ఈ చిత్రం రిలీజ్ ఆల‌స్య‌మైతే అయ్యింది కానీ.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అది సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు.

ఈ చిత్రంతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయిన కృతి శెట్టి వ‌రుస‌గా మంచి మంచి అవ‌కాశాలు అందుకుంది. ఉప్పెన త‌ర్వాత ఆమె న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్, బంగార్రాజు రెండూ కూడా హిట్ట‌వ‌డంతో ల‌క్కీ ఛార్మ్ అని పేరొచ్చేసింది. ప్ర‌స్తుతం కృతి చేతిలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, వారియ‌ర్, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం లాంటి క్రేజీ చిత్రాలున్నాయి. ఇప్పుడు కృతి రెండు పెద్ద సినిమాల్లో అవ‌కాశం అందుకున్న‌ట్లుగా వార్తలొస్తున్నాయి.

త‌మిళంలో సూర్య హీరోగా బాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రంలో కృతిని రెండో హీరోయిన్‌గా అనుకుంటున్నార‌ట‌. ఇదే నిజ‌మైతే త‌మిళంలోకి కృతి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లే. ఇక తాజా క‌బురేంటంటే.. ప్ర‌భాస్ హీరోగా మారుతి రూపొందించ‌నున్న చిత్రంలో ముగ్గురు హీరోయిన్ల‌కు స్థాన‌ముండ‌గా అందులో ఒక‌రు కృతి అంటున్నారు. మాళ‌విక మోహ‌న‌న్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. మూడో హీరోయిన్ ఇంకా ఖ‌రార‌వ్వ‌లేదు. ఉప్పెన రిలీజై ఏడాది మాత్ర‌మే కాగా.. ఈలోపు ఇన్ని సినిమాల‌తో కృతి ఇంత బిజీ అయిపోవ‌డం అనూహ్య‌మే.