ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల పరిస్థితి దారుణంగా మారింది. అసలే కరోనా దెబ్బకు అల్లాడిపోతే.. అది చాలదన్నట్లు టికెట్ల ధరలు తగ్గించి.. బెనిఫిట్ షోలు, అదనపు షోలు ఆపి వేయించి థియేటర్ల వ్యవస్థను గట్టి దెబ్బే తీసింది ఆంధ్రప్రదేశ్ సర్కారు. ఈ మధ్య రేట్లు కాస్త పెంచినా.. అదనపు షోలు, బెనిఫిట్ షోల విషయంలో మాత్రం పెద్దగా వెసులుబాటు ఇవ్వలేదు. ఐదో షోకు అనుమతి ఇచ్చినా.. దానికి వేరే మెలిక పెట్టారు.
ఐతే తెలంగాణలో మాత్రం దీనికి భిన్నంగా ఉంది పరిస్థితి. ఉన్న రేట్లను మించి టికెట్ల ధరలు పెంచడమే కాక.. ప్రతి పెద్ద సినిమాకూ రెండు వారాల వరకు అదనంగా రేట్లు పెంచుకునే అవకాశం కల్పించిన ఇక్కడి ప్రభుత్వం.. అదనపు షోల విషయంలోనూ సానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. దాదాపుగా ప్రతి పెద్ద సినిమాకూ ఐదో షో వేసుకునే అవకాశం కల్పిస్తోంది.
ఐతే ఇప్పటిదాకా ఏ సినిమాకు ఆ సినిమాకు ప్రత్యేకంగా ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టుకుని అనుమతులు పొందాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటిదాకా. ఐతే ఇకపై ఆ అవసరం లేదు. ప్రతి థియేటర్లోనూ రోజుకు ఐదు షోలు వేసుకోవడానికి శాశ్వత ప్రాతిపదికన అనుమతులు ఇస్తూ కొత్త జీవో జారీ చేసింది ప్రభుత్వం. కాకపోతే ఇందుకు నిర్దిష్ట సమయాన్ని సూచించింది.
ఉదయం 8 గంటల తర్వాత.. రాత్రి 1 గంట లోపే షోలు పూర్తి కావాలని.. రాత్రి 1 గంట నుంచి ఉదయం 8 వరకు షోలు వేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఇది ఇండస్ట్రీకి పెద్ద ఇబ్బందికర విషయమేమీ కాదు. ఐదో షోను మొన్నటిదాకా ఉదయం ఆరున్నర నుంచి 8 గంటల మధ్య మొదలుపెట్టేవారు. ఇకపై 8 నుంచే షోలు మొదలవుతాయి. ఇక ప్రతి సినిమాకూ వెళ్లి ప్రభుత్వానికి విన్నవించుకోవాల్సిన అవసరం లేదు. డిమాండ్ ఉన్న ఏ సినిమాకైనా ఏ ఇబ్బందీ లేకుండా ఐదు షోలు వేసుకోవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates