సూర్య సినిమాకు బిగ్ షాక్

ఒక‌ప్పుడు తెలుగులో మీడియం రేంజ్ హీరోల‌తో స‌మానంగా ఇక్క‌డ మార్కెట్ సంపాదించుకున్నాడు త‌మిళ స్టార్ సూర్య‌. వైవిధ్య‌మైన సినిమాలు చేయ‌డంతో పాటు అత‌డి న‌డ‌వ‌డిక‌, తెలుగు ప్రేక్ష‌కుల‌కు అత‌నిచ్చే ప్రాధాన్యం, ఇక్క‌డ శ్ర‌ద్ధ‌గా అత‌ను త‌న సినిమాల‌ను ప్ర‌మోట్ చేసే తీరు కూడా ఆక‌ట్టుకునేవి. ఐతే గ‌త కొన్నేళ్ల‌లో త‌న స్థాయికి త‌గని సినిమాలు చేసి ఇక్క‌డున్న మార్కెట్ అంతా దెబ్బ తీసుకున్నాడు. అత‌డి సినిమాల‌నే కాదు కానీ.. త‌మిళ చిత్రాల క్వాలిటీనే ప‌డిపోయింది.

అదే స‌మయంలో మ‌న సినిమాల క్వాలిటీ పెరిగింది. దీంతో త‌మిళ చిత్రాలు ఎంతో గొప్ప‌గా ఉంటే త‌ప్ప మ‌న వాళ్లు దేక‌ట్లేదు. ఇలాంటి టైంలో సూర్య ఈటి (ఎవ‌రికీ త‌ల‌వంచ‌డు) సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. శుక్ర‌వారం రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రం రిలీజ‌వుతుండ‌గా.. ముందు రోజు సూర్య సినిమాకు పెద్ద ఎత్తునే థియేట‌ర్లు ల‌భించాయి.

ఈటి ఎంత బాగున్నా రెండో రోజు నిలిచే ప‌రిస్థితి లేదు. కానీ ఈ చిత్రం తొలి రోజు బిగ్ రిలీజ్‌ను కూడా ఉప‌యోగించుకోలేక‌పోయింది. సూర్య సినిమాల ప‌ట్ల మొత్తంగా మ‌న వాళ్ల‌కు ఆస‌క్తి త‌గ్గిపోయిందా, లేక ఏమాత్రం ఆక‌ట్టుకోని టైటిల్, ప్రోమోల వ‌ల్ల దెబ్బ ప‌డిందా అన్న‌ది చెప్ప‌లేం కానీ.. ఈటి తొలి రోజు పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది. డే-1 కూడా ఎక్క‌డా దీనికి హౌస్ ఫుల్స్ ప‌డ‌లేదు. ఆక్యుపెన్సీ చాలా చోట్ల క‌నీస స్థాయిలో క‌నిపించింది.

మార్నింగ్ షో అయ్యేట‌ప్ప‌టికే పూర్తి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోవ‌డంతో మ‌ధ్యాహ్నం నుంచి థియేట‌ర్లు వెల‌వెల‌బోయాయి. త‌మిళ‌నాట కూడా ఈ చిత్రానికి ఏమంత సానుకూల స్పంద‌న క‌నిపించ‌డం లేదు. టాక్ డివైడ్‌గా ఉంది. తొలి రోజు వ‌ర‌కు హౌస్ ఫుల్స్ ప‌డ్డా.. త‌ర్వాత సినిమా వీక్ అయ్యేలాగే ఉంది. వీకెండ్ త‌ర్వాత అయితే నిల‌వ‌డం క‌ష్ట‌మే అంటున్నారు. ఈ సినిమాకు వ్య‌తిరేకంగా ట్విట్ట‌ర్లో గురువార‌మంతా యాంటీ ఫ్యాన్స్ నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేయ‌డం గ‌మ‌నార్హం.