ప్రభాస్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు ఇంకో ఐదు రోజుల్లో తెరపడబోతోంది. ‘సాహో’ చేదు అనుభవాలను ‘రాధేశ్యామ్’ చెరిపి వేస్తుందని ఎప్పట్నుంచో ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తుండగా.. కరోనా సహా రకరకాల కారణాల వల్ల ఈ సినిమా విడుదల బాగా ఆలస్యం అయింది. ఐతే ఎట్టకేలకు ఈ శుక్రవారం ‘రాధేశ్యామ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. నిజానికి ఒక దశలో ఈ సినిమా మీద చాలా నెగెటివిటీ కనిపించింది.
సరిగా ప్రమోషన్లు చేయకపోవడం, చిత్ర బృందం రిలీజ్ చేసిన ప్రోమోలు అనుకున్న స్థాయిలో లేకపోవడం అందుకు కారణం. కానీ సంక్రాంతి రేసు నుంచి సినిమాను తప్పించి.. మార్చి 11కు వాయిదా వేశాక.. ఈ మధ్య ప్రమోషన్ల హడావుడి పెంచారు. రిలీజ్ ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా ఉండటం ప్లస్ అయింది. దీంతో సినిమాకు నెమ్మదిగా హైప్ పెరుగుతోంది. ఈ చిత్రానికి ఇప్పటికే ఫస్ట్ కాపీ రెడీ చేసి సెన్సార్ కూడా పూర్తి చేయడం విశేషం.
ఇప్పుడు ‘రాధేశ్యామ్’ సెన్సార్ టాక్ గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ‘రాధేశ్యామ్’ నిడివి పరంగా పెద్ద సినిమానే అంటున్నారు. రన్ టైం దాదాపు 2.45 గంటలట. సెన్సార్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ‘రాధేశ్యామ్’ ఫస్టాఫ్ సోసోగా ఉంటుందట. కానీ సెకండాఫ్ వేరే లెవెల్ అంటున్నారు.
పూర్తి ఎమోషనల్‌గా, ఉత్కంఠభరిత మలుపులు, భారీతనంతో ‘రాధేశ్యామ్’ ద్వితీయార్ధం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని.. పతాక సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా ఉంటాయని.. ఒక దృశ్యకావ్యం చూసిన అనుభూతిని చివర్లో ఈ సినిమా కలిగిస్తుందని చెబుతున్నారు.
చిత్ర బృందం పడ్డ కష్టమంతా తెరపై కనిపిస్తుందని, విజువల్స్, సెట్టింగ్స్, పాటలు, ఎమోషన్లు, ప్రభాస్-పూజా హెగ్డేల కెమిస్ట్రీ సినిమాకు పెద్ద బలమని అంటున్నారు. మరి ఈ టాక్ ఎంత వరకు నిజమో చూడాలి. ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణకుమార్ రూపొందించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్లో నిర్మించింది.