టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున, ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన తాజా చిత్రం `బంగార్రాజు`. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన ఈ మూవీలో కృతి శెట్టి, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు. 2016లో విడుదలై సూపర్ డూపర్ హిట్గా నిలిచిన `సోగ్గాడే చిన్నినాయన` చిత్రానికి సీక్వెల్గా రూపుదిద్దుకున్న ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ బ్యాన్లపై నాగార్జున స్వయంగా నిర్మించారు.
భారీ అంచనాల నడుమ జనవరి 14న విడుదలైన ఈ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పెద్ద బంగార్రాజుగా నాగార్జున, చిన్న బంగార్రాజుగా నాగ చైతన్యలు ఒదిగిపోయి నటించారు. కథ రోటీన్గానే ఉన్నప్పటికీ.. నాగ్-చైతుల నటన, గ్రామీణ నేపథ్యం, సంగీతం, కళ్యాణ్ కృష్ణ టేకింగ్ సినిమాను హిట్ అయ్యేలా చేశాయి.
దీంతో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ప్యూ అమలులో ఉన్నా, టికెట్ రేట్లు తక్కువగానే ఉన్నా.. అన్నింటినీ అధిగమించిన బంగార్రాజు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18న ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో స్ట్రీమింగ్ చేశారు. అయితే ఓటీటీలో సైతం బంగార్రాజు ఇరగదీస్తోంది.
ఈ నేపథ్యంలోనే అక్కినేని సోగ్గాళ్లు తాజాగా సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఓటీటీ వేదికగా ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తోన్న బంగార్రాజు చిత్రం.. జీ5లో రిలీజ్ అయిన ఏడు రోజుల్లోనే ఏకంగా 500 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను సొంతం చేసుకుని సక్సెస్ ఫుల్గా దూసుకుపోతోంది. దీంతో తక్కువ సమయంలోనే అత్యధిక స్ట్రీమింగ్ నిమిషాలను దక్కించుకున్న సినిమాగా బంగార్రాజు రికార్డు సెట్ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ద్వారా తెలియజేస్తూ.. నాగార్జున, నాగ చైతన్యలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.