టాలీవుడ్‌ను దాదాపు పది నెలలుగా వేధిస్తున్న సమస్యకు ఎంతకీ పరిష్కారం దొరకట్లేదు. గత ఏడాది వేసవిలో పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ సర్కారు టికెట్ల రేట్ల మీద నియంత్రణ తేవడంతో మొదలైన ఈ సమస్య ఆ తర్వాత రకరకాల పరిణామాలతో మరింత జఠిలంగా మారింది. ఇండస్ట్రీ మొత్తం ఈ ఉచ్చులో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
సమస్య పరిష్కారానికి మెగాస్టార్ చిరంజీవి సహా ఇండస్ట్రీ పెద్దలు ఎంతగా ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకపోయింది. టికెట్ల రేట్ల సవరణ విషయమై ఇదిగో అదిగో అంటూనే నెలలు నెలలు గడిచిపోయాయి. లాజిక్‌తో ఆలోచిస్తే చాలా సింపుల్‌గా పరిష్కారం అయిపోయే విషయాన్ని ప్రభుత్వం కావాలనే సాగదీస్తోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇండస్ట్రీ మొత్తం తమకు సాగిలపడేలా చేసుకోవడానికే జగన్ సర్కార్ ఇలా చేస్తోందనే విమర్శలూ తెలిసిందే.
ఈ నేపథ్యంలో గురువారం జగన్‌తో చిరు నేతృత్వంలో సినీ ప్రముఖుల సమావేశం కీలకంగా మారింది. గత నెలలో చిరంజీవి ఒక్కడే తాడేపల్లికి వెళ్లి సీఎం జగన్‌ను ఆయన నివాసంలో కలవడం తెలిసిందే. ఐతే ఈసారి చిరుతో పాటు పరిశ్రమలో కీలకంగా ఉన్న స్టార్ హీరోలను కూడా వెంటబెట్టుకుని వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జగన్ సన్నిహిత వర్గాల నుంచి ఇవే సంకేతాలు అందాయట. టాలీవుడ్ ప్రముఖ హీరోలందరినీ వెంటబెట్టుకుని కలిసి సీఎంను ప్రసన్నం చేసుకుంటేనే టికెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు వస్తుందనే గుసగుసలు నడుస్తున్నాయి టాలీవుడ్లో.
ఈ నేపథ్యంలో చిరు టాప్ స్టార్లు ఒక్కొక్కరికి ఫోన్ చేస్తున్నారని.. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్.. ఇలా చాలామందికి ఫోన్లు చేస్తున్నారని అంటున్నారు. ఐతే ఇప్పుడు చిరు విన్నపాన్ని మన్నించి ఆయన వెంట వెళ్లి ఏపీ సీఎంను కలిసేదెవరన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్, మహేష్ లాంటి వాళ్లు రాజకీయాలకు పూర్తిగా దూరం కాబట్టి వెళ్లడానికి ఇబ్బంది లేకున్నా.. సీఎంను కలిసే విషయంలో వాళ్లిద్దరూ సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ ఇప్పుడు ఈ బృందంతో వెళ్లాడంటే అతడి భవిష్యత్ రాజకీయ ప్రయాణానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. పవన్ కళ్యాణ్ వెళ్లే అవకాశమే లేదన్నది స్పష్టం. బన్నీ కూడా వెళ్లడం అనుమానమే. మరి గురువారం చిరు వెంట నడిచేదెవరో చూడాలి.