రాజకీయాల్లో పరిస్థితులు ఇట్టే మారిపోతుంటాయి. ఒక్కోసారి విచిత్రమైన పరిణామాలు ఎదురవుతుంటాయి. పరిస్థితులు ప్రభావం దృష్ట్యా కొన్ని సార్లు తగ్గాల్సి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా అలాంటి పరిస్థితే ఎదురయ్యేలా ఉంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై పోరుబావుటా ఎగరేసిన కేసీఆర్.. మోడీ పర్యటనకు వెళ్లలేదు. ఇక్రిసాట్ స్వరోత్సవ సంబరాలు, రామానూజాచార్యుల విగ్రహ ఆవిష్కరణ కోసం మోడీ హైదరాబాద్ వస్తే కేసీఆర్ జ్వరం పేరుతో వెళ్లకుండా ఉన్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్.. మోడీని రాష్ట్రానికి ఆహ్వానించాల్సిన పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.
రాష్ట్రంలోని యాదాద్రిని కేసీఆర్ ప్రభుత్వం గొప్పగా తీర్చిదిద్దుతోంది. ఈ ఆలయ పునఃప్రారంభం వచ్చే నెలలోనే జరుగుతుంది. ఆ పనుల పర్యవేక్షణ కోసం కేసీఆర్ ఈ రోజు అక్కడికి వెళ్లారు. పునఃప్రారంభం కార్యక్రమం సందర్భంగా చేపట్టే మహాకుంభ సంప్రోక్షణ కోసం నిర్వహించే సుదర్శన యాగం ఇతర ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహిస్తారు. మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి గతంలో ప్రధాని మోడీని కేసీఆర్ ఆహ్వానించారు. ఢిల్లీ వెళ్లి కలిసినప్పుడు యాదాద్రి పునః ప్రారంభానికి రావాలని కేసీఆర్ ఆహ్వానించగా.. మోడీ కూడా సానుకూలంగా స్పందించారు.
కానీ ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయి. మోడీ అంటేనే కేసీఆర్ ఒంటికాలిపై లేస్తున్నారు. ప్రధానిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అలాంటిది అధికారికంగా ప్రధానిని ఆయన ఆహ్వానిస్తారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఒకవేళ ఆహ్వానించిన మోడీ వస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనలో కేసీఆర్ పాల్గొనాల్సిందని కొన్ని వర్గాల ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. అలాంటిది ఇప్పుడు మోడీని యాదాద్రికి కేసీఆర్ ఆహ్వానించకుంటే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి కలుగుతోంది. ఒకవేళ మోడీ యాదాద్రికి వస్తే మాత్రం అప్పుడు కేసీఆర్ ఎలాగో ఆయన వెంట ఉండాల్సందే కదా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.