భారీ చిత్రం.. ప్రైమ్‌లో డైరెక్ట్ రిలీజ్

క‌రోనా కేసులు పెరిగిపోయి దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో థియేట‌ర్లు మూత ప‌డుతుండ‌టం.. తెరిచి ఉన్న చోట్ల కూడా ఆంక్ష‌ల‌తో న‌డుస్తుండ‌టం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ కొత్త సినిమాలు కొన్ని థియేట్రిక‌ల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. ఈ విష‌యంలో ఓటీటీలు బాగానే దూకుడు చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీలకు త‌మిళ సినిమాల‌తో మంచి డీల్స్ కుదురుతున్న‌ట్లున్నాయి.

ఆల్రెడీ కీర్తి సురేష్ సినిమా సానికాయిదంను అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఇప్పుడు ఓ పెద్ద సినిమాకు ప్రైమ్‌లో డిజిట‌ల్ రిలీజ్ ఖ‌రారైంది. త‌మిళంలో పెద్ద హీరోల్లో ఒక‌డైన విక్ర‌మ్ న‌టించిన మ‌హాన్ థియేట్రిక‌ల్ రిలీజ్ స్కిప్ చేసి ప్రైమ్‌లో రిలీజ్ కాబోతోంది. ఫిబ్ర‌వ‌రి 10న దీనికి ప్రిమియ‌ర్స్ క‌న్ఫ‌మ్ అయ్యాయి. ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ కాబోతోంద‌ని కొన్ని రోజుల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇప్పుడా ప్ర‌చార‌మే నిజ‌మ‌వుతోంది. అర్జున్ రెడ్డి రీమేక్‌తో హీరోగా ప‌రిచ‌యం అయిన విక్ర‌మ్ త‌న‌యుడు ధ్రువ్.. మ‌హాన్‌లో కీల‌క పాత్ర పోషించ‌డం విశేషం. రెండో సినిమాకే అత‌ను తండ్రితో క‌లిసి న‌టించేశాడు. పిజ్జా, జిగ‌ర్ తండ చిత్రాల ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హాన్ తెర‌కెక్కింది. కార్తీక్ చివ‌రి సినిమా జ‌గ‌మే తంత్రం సైతం నేరుగా ఓటీటీలో రిలీజైన సంగ‌తి తెలిసిందే.

నెట్ ఫ్లిక్స్‌లో వ‌చ్చిన ఆ సినిమా ప్రేక్ష‌కుల‌ను తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. ద‌ర్శ‌కుడిగా ఆరంభంలో అద్భుత‌మైన సినిమాలు తీసిన కార్తీక్.. పేట నుంచి నిరాశ ప‌రుస్తున్నాడు. మ‌రి మ‌హాన్‌తో అయినా అత‌ను త‌న పూర్వ‌పు స్థాయిని అందుకుంటాడేమో చూడాలి. మ‌హాన్ పోస్ట‌ర్లు చూస్తుంటే.. విక్ర‌మ్, ధ్రువ్ ఒక‌రినొక‌రు ఢీకొట్టే పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్న‌ట్లు అనిపిస్తోంది. మ‌రి తండ్రీ కొడుకుల పోరు ఎలా పండుతుందో చూడాలి. ఇందులో బాబీ సింహా, సిమ్రాన్ కీల‌క పాత్ర‌లు పోషించారు. సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీత ద‌ర్శ‌కుడు.