బాలయ్య సినిమా.. ఇంట్రెస్టింగ్ బ్యాక్‌డ్రాప్

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మామూలు ఊపులో లేడు. ‘యన్.టి.ఆర్’, ‘రూలర్’ సినిమాలతో ఆయన పనైపోయిందని వ్యాఖ్యానించిన అందరికీ ‘అఖండ’ మూవీతో తిరుగులేని సమాధానం చెప్పారు. ఈ సినిమా సాధించిన విజయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరీ గొప్ప ఏమీ రాకున్నా సరే.. బాక్సాఫీస్ దగ్గర రూ.130 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి ఔరా అనిపింది. అర్ధశత దినోత్సవం గురించి అందరూ మరిచిపోయిన టైంలో వందకు పైగా సెంటర్లలో ఇది 50 రోజులు ఆడటం విశేషం.

తాజాగా హాట్ స్టార్‌లో రిలీజై.. అక్కడా రికార్డు వ్యూస్‌తో సంచలనం రేపుతోంది. మరోవైపు బాలయ్య తొలిసారి హోస్ట్‌గా చేసిన టాక్ షో ‘అన్ స్టాపబుల్’ సైతం సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఆయన పాపులారిటీ ఇంకా పెరిగింది. ఈ ఊపును కొనసాగించేలా సినిమాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు బాలయ్య. గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి లాంటి మంచి ఫాంలో ఉన్న స్టార్ డైరెక్టర్లతో ఆయన సినిమాలు ఓకే చేసిన సంగతి తెలిసిందే.

గోపీచంద్ సినిమా త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుండగా.. అనిల్ సినిమాపై ఇంకా స్పష్టత రాలేదు. ఈలోపు బాలయ్య మరో చిత్రాన్ని ఓకే చేసినట్లు వార్తలొస్తున్నాయి. తనతో ‘అన్ స్టాపబుల్’ చేయించిన అల్లు అరవింద్‌తో బాలయ్య తొలిసారి ఓ సినిమా కోసం జట్టు కట్టబోతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. నందమూరి కళ్యాణ్ రామ్‌తో ‘బింబిసార’ చేసిన యువ దర్శకుడు మల్లిడి వశిష్ఠ్‌ తయారు చేసిన కథతో బాలయ్య హీరోగా పెట్టి సినిమా చేయాలన్నది అరవింద్ ఆలోచన. ఈ కుర్రాడి పేరు చాన్నాళ్ల ముందు నుంచే చర్చనీయాంశం అవుతోంది.

గతంలో అల్లు శిరీష్ హీరోగా ఒక పీరియడ్ మూవీని అతను డైరెక్ట్ చేయాల్సింది. కానీ ఏవో కారణాలతో అది ఆగిపోయింది. తర్వాత ‘బింబిసార’ చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా ఔట్ పుట్ చూసిన వాళ్లందరూ బాగా ఇంప్రెస్ అయ్యారట. అందులో అరవింద్ కూడా ఒకరట. రిటైర్మెంట్‌కు దగ్గర పడ్డ ఓ పోలీస్ అధికారి కథ ఇదని.. మామూలుగా రిటైర్మెంట్‌కు ముందు చివరి ఆరు నెలలు బదిలీ చేయకూడదన్న అవకాశాన్ని ఉపయోగించుకుని హీరో విలన్ల పని పట్టే క్రమంలో కథ నడుస్తుందని.. ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఈ లైన్‌కు అరవింద్ ఇంప్రెస్ అయ్యారని.. పోలీస్ పాత్రల్లో బాలయ్య చెలరేగిపోతాడు కాబట్టి ఆయనే ఈ క్యారెక్టర్‌కు కరెక్ట్ అని ఫిక్సయ్యారట. కాకపోతే రిటైర్మెంట్‌కు దగ్గర పడ్డ పాత్రను బాలయ్య ఓకే చేస్తాడా అన్నది ప్రశ్న. ఓకే చేస్తే మాత్రం ఆయన కెరీర్లో ఇదొక స్పెషల్ క్యారెక్టర్ అయ్యే అవకాశముంది.