మార్చి మ‌ధ్య‌లో రాధేశ్యామ్?

అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే ఇప్పుడు రాధేశ్యామ్ హంగామా న‌డుస్తుండాల్సింది థియేట‌ర్ల‌లో. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14కు షెడ్యూల్ అయిన ఈ చిత్రం క‌రోనా థ‌ర్డ్ వేవ్ విజృంభ‌ణ‌తో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో వాయిదా ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చాలా ఆల‌స్య‌మైన ఈ సినిమా మ‌ళ్లీ ఎప్ప‌టికి థియేట‌ర్ల‌లోకి దిగుతుందో అర్థం కాని అయోమ‌యంలో ఉన్నారు అభిమానులు.

వ‌చ్చే రెండు నెల‌ల్లోపు అయితే ఈ సినిమా రిలీజ‌య్యే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. ఫిబ్ర‌వ‌రి మీద ఎవ‌రికీ ఆశ‌ల్లేవు. ఐతే మార్చి ప్ర‌థ‌మార్ధంలో క‌రోనా నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుందంటూ నిపుణులు అంచ‌నాలు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టి దేశ‌వ్యాప్తంగా థియేట‌ర్లు న‌డ‌వ‌డం మొద‌లైతే.. ఎక్కువ స‌మ‌యం తీసుకోవ‌ద్ద‌న్న‌ది రాధేశ్యామ్ టీం ఉద్దేశ‌మ‌ట‌.

ఏప్రిల్ మీద ఆశ‌లు పెట్టుకుంటే స‌రైన డేట్ దొర‌క‌డం క‌ష్ట‌మ‌ని.. ఆర్ఆర్ఆర్ కూడా ఆ నెల చివ‌ర్లో వ‌చ్చేందుకు చూస్తుండ‌టం, మ‌ధ్య‌లో కేజీఎఫ్‌-2 రావాల్సి ఉండ‌టంతో రాధేశ్యామ్‌కు అవ‌కాశం ద‌క్క‌డం క‌ష్ట‌మే. వేస‌వికి భారీ చిత్రాలు చాలానే షెడ్యూల్ అయి ఉండ‌టంతో స‌రైన‌ డేట్ కోసం చూస్తూ పోతే సినిమా మ‌రింత ఆల‌స్య‌మ‌వుతుంద‌ని.. అందుకే ప‌రిస్థితులు కాస్త సానుకూలంగా మార‌గానే ఆల‌స్యం చేయ‌కుండా సినిమాను రిలీజ్ చేసేయాల‌ని యువి క్రియేష‌న్స్ వాళ్లు చూస్తున్నార‌ట‌.

హిందీ సినిమాలేవీ కూడా మార్చిలో రిలీజ్ చేసే సాహ‌సాలు చేయ‌క‌పోవ‌చ్చ‌ని.. తెలుగులో కూడా మీడియం సినిమాలే వ‌చ్చే ఛాన్సుంద‌ని.. కాబ‌ట్టి పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను వ‌దిలేయొచ్చ‌ని అనుకుంటున్నార‌ట‌. కానీ దీనికి కూడా ష‌ర‌తులు వ‌ర్తించును అనుకోవాల్సిందే. క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌కుండా, థియేట‌ర్లు మూత‌ప‌డి ఉంటే మాత్రం రాధేశ్యామ్ టీం చేయ‌డానికేమీ ఉండ‌దు.