మిగతా విషయాల్లో ఎవరి అభిరుచి ఎలా ఉన్నప్పటికీ.. సినిమాల విషయంలో తెలుగు ప్రేక్షకులందరి ఆలోచనా ఒకేలా ఉండేది ఒకప్పుడు. బేసిగ్గా ఆంధ్రా ప్రాంతంలో సినిమాల పిచ్చి కాస్త ఎక్కువ కాబట్టి మిగతా చోట్ల కంటే అక్కడ వసూళ్లు కాస్త ఎక్కువ ఉంటాయి. అంతే తప్ప సినిమా రిజల్ట్ విషయంలో ఒక్కో చోట ఒక్కో రకమైన ఫలితం రావడం ఎప్పుడో కానీ జరగదు. కానీ ఈ మధ్య ఈ అంతరం స్పష్టంగా కనిపిస్తోంది.
తెలంగాణలో బ్లాక్‌బస్టర్లు, హిట్లు అనిపించుకుంటున్న సినిమాలు ఆంధ్రాలో బాక్సాఫీస్ ఫెయిల్యూర్లుగా నిలుస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఏపీలో టికెట్ల రేట్లు తక్కువగా ఉండటమే. సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ రేట్లు తక్కువగా ఉండటంతో వసూళ్లు ఆశించిన స్థాయిలో ఉండక ఏపీలో సినిమాలు ఫ్లాపులుగా నిలుస్తున్నాయి.
కానీ ‘బంగార్రాజు’ సినిమా విషయంలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా జరుగుతోంది. ఈ చిత్రం ఏపీలో తక్కువ రేట్లతోనే సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తుంటే.. తెలంగాణలో మాత్రం రోజు రోజుకూ పడిపోతున్న వసూళ్లతో సినిమా డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. ఫస్ట్ వీకెండ్లో ఆంధ్రా, రాయలసీమ కలిపి రూ.15 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం.. తెలంగాణలో మాత్రం ఐదున్నర కోట్ల షేర్‌కు పరిమితం అయింది. పండుగ సెలవుల్లో ఆంధ్రా, రాయలసీమ జనాలంతా తమ స్వస్థలాలకు వెళ్లి అక్కడే ‘బంగార్రాజు’ సినిమా చూడటం వల్ల ఈ వసూళ్ల అంతరం ఎక్కువ ఉందేమో అనుకున్నారు.
కానీ వీకెండ్ తర్వాత ‘బంగార్రాజు’ పరిస్థితిలో మార్పు లేదు. తెలంగాణలో ఈ సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి. హైదరాబాద్ సిటీలో కూడా వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఈ సినిమాకు ఎంత వీక్ డే అయినా సరే.. బుధవారం ఈ చిత్రానికి తెలంగాణ అంతటా కలిపి రూ.8 లక్షల షేర్ వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో ఆంధ్రాలో నిన్న ఈ చిత్రానికి చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఆక్యుపెన్సీ 50 శాతానికి తగ్గించి, చాలా చోట్ల నైట్ షోలు రద్దు చేసినా ఆంధ్రాలో షేర్ కోటి కన్నా ఎక్కువే వచ్చింది ఆరో రోజు. ఒక సినిమాకు రెండు ప్రాంతాల్లో కలెక్షన్ల పరంగా ఇంత వైరుధ్యం ఆశ్చర్యం కలిగించే విషయం.